భారతదేశంలో అసంఘ టిత రంగంతో కలుపుకొని 4.72 కోట్ల మంది ఉద్యోగ, కార్మికులు ఉన్నారు. ఆయా రంగాలలో ఉన్న వివిధ స్వతంత్ర యూనియన్లూ, సంఘాలు కాకుండా దేశవ్యాప్తంగా 11 జాతీయ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఈ జాతీయ ట్రేడ్ యూనియన్లు అన్నింటికీ వివిధ రాజకీయ పార్టీలతో అనుబంధాలు, స్వతంత్ర అభిప్రాయాలూ ఉన్నాయి. అయినా, అన్ని సంఘాలూ కలిసి ప్రభుత్వ విధానాలలో మార్పును కోరుతూ సమైక్యంగా 28 ఫిబ్రవరి 2012 సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం విశేషం. ఇలా అన్ని కార్మిక సంఘాలూ కలిసి సమ్మె పిలుపు ఇవ్వడం 64 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరుదైన సంఘటన.
సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం - కార్మికులపై ఎలా ఉంది?
1991లో భారతదేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు ప్రారంభమైన తర్వాత రెండు ప్రధానమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటి దశలో కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం ప్రారంభమైంది. ఇది అంతకుముందే ఉన్నా 1991 తర్వాత మరింత ఉధృతమైంది. కార్మిక శాఖ అధికారుల తనిఖీలు నిలిపివేశారు. రెండవ దశలో, కార్మిక చట్టాలను బలహీనపరిచే ప్రక్రియ మొదలైంది. ఈ చట్టాలలోని మార్పులపై యూనియన్లతో చర్చించకపోవడం లేదా యూనియన్లు చేసిన సూచనలను, మార్పులను త్రోసిపుచ్చుతోంది. అయితే యాజమాన్యాలకు మరిన్ని హక్కులు కల్పిస్తూ లేఆఫ్‌లకు, మూసివేతలకు, ఔట్‌సోర్సింగ్‌లకు మరింత వెసులుబాటు కల్పించారు.
సెజ్‌ల ఏర్పాటుకు విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేస్తూ, సెజ్‌లలో యూనియన్లు ఏర్పాటుకు వీలు కాకుండా చేశారు. 1983లో కార్మికశక్తి 66.5 శాతం ఉండగా 2000 సంవత్సరంలో అది 61.8 శాతానికి తగ్గింది. 2012 నాటికి ఇది 57 శాతానికి పైగా పడిపోయింది. గత ఐదు సంవత్సరాల కాలాన్నే తీసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఆరు లక్షల ఉద్యోగాలను కోల్పోయాం. బ్యాంకింగ్ రంగంలోనే గత ఐదు సంవ్సరాలలో 1,50,000 ఉద్యోగాలను కోల్పోయాం. ప్రయివేటు రంగానికి, విదేశీ బహుళజాతి సంస్థలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు రక్షణ రంగంలో కూడా 26 శాతం పెట్టుబడులను ఉపసంహరించారు. ఈ ఉదారవాద విధానాల అమలు ఫలితంగా ఉద్యోగ భద్రత లేకుండా పోవడం అసమానతలు పెరుగుదల, పేదరికం పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక ప్రగతి కుంటుంపడడం... ఎల్‌పిజి విధానాల వల్ల ఉద్యోగ, కార్మిక వర్గాలే కాకుండా పేదలకు కూడా అన్యాయం జరుగుతోంది. 1993 నుండి 2011 దాకా రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. వ్యవసాయానికి సబ్సిడీలు నిలిపివేశారు. యూరోపియన్ దేశాలలో ఆవుకి రోజుకి రెండు డాలర్ల సబ్సిడీ ఇస్తారు. మన దేశంలో పేదవాడికిచ్చే సబ్సిడీ కన్నా యూరోపియన్ దేశంలో పశువులకు ఇచ్చే సబ్సిడీయే ఎక్కువ.
సార్వత్రిక సమ్మె
ప్రభుత్వం పెట్టుబడిదారులకు కల్పిస్తున్న పన్ను రాయితీల వివరాలను ప్రతి బడ్జెట్‌లో 'స్టేట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ ఫోర్‌గాన్ (Statement of Revenue foregone) ప్రకటిస్తుంది. 2006 నుండి 2011దాకా ఈ బడా పెట్టుబడిదారులకు ఇచ్చిన రాయితీలు దాదాపు 21 లక్షల కోట్లుగా ఉంది. ఇదే ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వర్గాలకు పెన్షను, కనీస వేతనం లాంటి అనేక అంశాలపై కోత విధిస్తూ, ప్రయివేటుపరం చేస్తోంది. అసంఘటిత కార్మికుల పరిస్థితిపై అర్జున్‌సేన్‌గుప్తా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 82.6 కోట్ల మంది కార్మికులు రోజుకు రూ. 20 కంటే తక్కువ సంపాదన మీద ఆధారపడి బతుకీడ్చుతున్నారు.
పెట్టుబడిదారలకు గత ఐదు సంవత్సరాలలో 21 లక్షల కోట్ల పన్ను రాయితీలు కల్పించిన ఆర్థికమంత్రికి సబ్సిడీలపై కేవలం గత ఐదు సంవత్సరాలలో 5 లక్షల కోట్ల రాయితీలు కల్పించడం వల్ల నిద్ర రావడం లేదు. సబ్సిడీలను ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయంటే ట్రాక్టరు మీద బ్యాంకు రుణంపై వడ్డీ 12.5 శాతం ఉంటే, డ్వాక్రా సహాయ సంఘాలపై రుణంపై వడ్డీ 36 శాతం, బిఎస్‌ఎన్‌ఎల్‌లో లేని రుణానికి వసూలు చేసిన వడ్డీ 14 శాతం ఉండగా కార్లపై రుణ వడ్డీ 7 శాతంగా ఉంది. ఇలాంటి అవకతవక విధానాల వల్ల ఉద్యోగ, కార్మిక వర్గాలపై ఒత్తిడి పెరిగింది. పెన్షను ప్రమాదంలో పడిపోయింది. కనీస వేతనాలు లేవు. ధరల పెరుగుదలపై అదుపులేదు. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఆహార భద్రత ప్రమాదంలో పడింది. మధ్య తరగతిలో అసహనం పెరిగింది. వీటన్నింటి ప్రతిరూపమే ఫిబ్రవరి 28 సార్వత్రిక సమ్మె.
ఇన్ని కోట్ల మంది తన విధానాల పట్ల తమ నిరసనని వ్యక్తం చేస్తున్నా ఈ ఇరవైఏళ్ల సంస్కరణల కాలంలో 13సార్లు దేశవ్యాపిత సమ్మెలు జరిగినా ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. ఈ కపట నిద్ర నుండి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే సంఘటిత పోరాటమే ఏకైక మార్గం.
అయితే ఈ నెల 14,15 తేదీలలో ఢిల్లీలో జరిగిన భారత కార్మిక సదస్సులో పాల్గొన్న కేంద్ర కార్మిక మంత్రిగానీ, గౌరవనీయ ప్రధానమంత్రిగానీ ఫిబ్రవరి 28 సమ్మె గురించిగానీ, సమ్మె డిమాండ్ల పరిష్కారం గురించిగానీ మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. సమ్మె డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ సంఘటన తెలియజేస్తోంది.
కనీస వేతనాలను అన్ని రంగాలలో అమలు చేయాలని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి గానీ, కనీస వేతనాల గురించి వారేమీ ప్రస్తావించలేదు.
'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం' అనే సామెతను ఒకసారి గుర్తు చేసుకుంది. విధానాలపై తగు పోరాటాలు జరగక పోవడం వల్ల 'గ్రీస్' దేశం దివాలా తీస్తే, బకాయి దారుల ఒత్తిడిమేరకు పొదుపు చర్యల పేరుతో పెన్షను రద్దు, ఉద్యోగాల తగ్గింపు సామాజిక భద్రతా పథకాల రద్దుకు అక్కడి ప్రభుత్వం పూనుకుంది. గ్రీస్ దేశంలో ఉద్యోగులు ఇప్పుడు వీధుల్లో పోరాటం చేస్తున్నారు. ఎలాంటి యూనియన్ల మద్దతు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆక్యుపై వాల్‌స్ట్రీట్ మేము 99 మీరు ఒకపక్క శాతం మాత్రమే లాంటి ఉద్యమాలు వ్యాప్తి చెందుతున్నాయంటే సరళీకృత విధానాల పట్ల మధ్య తరగతి ప్రజలలో పెరిగిన అసహనం, పేదలపై పెరిగిన దాడులే కారణం. ఉద్యమాలు లొంగుబాటు వైపు సాగిన దేశాలలో ఆలస్యంగా మేల్కొన్నా ప్రయోజనం లేదు. అందుకనే మనం లొంగుబా