ఈ వారం స్నేహ ఆదివారం అనుబంధం సందేశాత్మకంగా అట్టమీది కథ ద్వారా ఆత్మహత్యలు చేసుకొంటున్న వారు జాగ్రత్త పడాలని వారిలో ఆత్మస్థర్యాన్ని కలిగించేలా మీరు ప్రచురించిన కవర్ స్టోరీ కథనం చాలా బావుంది. సమాజంలో చైతన్య వికాసానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. 'స్నేహ' ఆదివారం అనుబంధం తెలుగు సాహితీ విలువలకి వన్నె తెచ్చేలా తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు.
-ఎల్. ప్రఫుల్ల చంద్ర, అనంతపురం.
సరదాగా సూపర్ హిట్టు...
ఆదివారం అనుబంధం సంచికలోని 'సరదా సరదాగా సూపర్ హిట్టు' నన్ను మిక్కిలి ఆనంద సాగరంలో ముంచింది. తాపీ ధర్మారావు గారు పాతతరం సినిమా కథలు, మాటలకి పేరు గాంచిన వ్యక్తిగానే కాకుండా ప్రముఖ సంపాదకుడనే విషయాలు ఆశ్చర్యపరిచాయి. ఆయన తనయుడు కూడా అభ్యుదయ భావాలు కలిగిన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'రాముడు-భీముడు' నిర్మాతగా రామానాయుడికి తొలి చిత్రం. ఆయన జీవితం మలుపు తిప్పడానికి దోహదపడింది. నటీనటుల నటన తారాస్థాయికి చేరుకుంది. రామారావు గారి ద్విపాత్రాభినయంలో తొలి చిత్రం 'రాముడు భీముడు'. ఈ చిత్రంలో సంగీతం చిత్ర విజయానికి కీలకమయ్యింది. అప్పుడు తీసిన ఈ చిత్రం ఇప్పటి తరాన్నీ ఆకట్టుకునేలా వుండడం అభినందనీయం. రామానాయుడు వారసులు కూడా ఆయన బాటలో పయనిస్తుండటం హర్షించదగ్గ విషయం.
-కై.ప నాగరాజు, అనంతపురం.
భళారే ఈ చిత్రం
'భళారే విచిత్రం ఈ చిత్రం' ఈ వారం అట్ట మీది కథ సినిమా పరిణామక్రమాన్ని కళ్ళ ముందు నిలబెట్టింది. మూకీతో ప్రారంభమైన సినిమా ఇంతింతై అన్నట్టుగా కాలమాన పరిస్థితుల్ని తనలో కలుపుకొని ఆబాల గోపాలాన్ని రంజింపచేసే దృశ్య మాధ్యమంగా విరాజిల్లుతోంది. మొదట్లో గుడారాలు వేసి సినిమా ఆడటం బళ్ళ మీద దూరప్రాంతాల నుండి ప్రజలు తండోప తండాలుగా వచ్చి తిలకించిన ఆనాటి తీపి జ్ఞాపకాలను ఈ వ్యాసం మళ్ళీ గుర్తుచేసింది. బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్లోకి ఆ తర్వాత త్రీడిలోకి సినిమా రూపాంతరం చెందటం విప్లవాత్మక పరిణామం. ఎప్పటికి ఏ నాటికి సినిమా జనాకర్షక శక్తే. నవ్వుల్ పువ్వుల్, కిసుక్కు చిత్రం బాగున్నాయి.
-మంకు శ్రీను, కొప్పర్రు.
శ్వాసిస్తే సాధించగలం
