69 ఏళ్లుగా ప్రభుత్వం చేయలేనిది నలుగురు బెంగళూరు విద్యార్థులు చేశారు. ఓ గ్రామానికి కాంతులనందించారు. ఈ చిరు దివ్వెల ప్రయత్నానికి మరికొందరు దీపం పట్టారు. పశ్చిమ కనుమల్లో ఎవరికీ పట్టని కర్నాటక గ్రామాలు ఖంగావ్, ఘట్కునాంగ్ల్లో సోలార్ వెలుగులతో చీకట్లకు సరిహద్దులు గీశారు. పక్కనే కాళీ నదిపై 110 మెగావాట్ల సూపా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉన్నా కూడా విద్యుల్లతలు అల్లుకోని గ్రామాలు ఆ అడవుల్లో ఎన్నో. ఇప్పుడు వాటిలో కూడా రెండో సూరీడు వెలుగనున్నాడు.
బెంగళూరు ఎమ్మెస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థులు సన్నీ అరొకియా స్వామి, బాలచంద్ర ఎం హెగ్డే, కుమార స్వామి, కోట్రేశ్ వీరాపురా. 23 ఏళ్ల ఈ మిత్రుల బృందం తమ చదువుల వల్ల లాభం పొందాల్సింది తామే కాదు సమాజం కూడా అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమాజం పట్టణాల్లో కాదు. ఈ సమాజం అడవుల్లో తప్పిపోయినది. అదే గిరిజనుల గ్రామం. వాటిని వెతుక్కుంటూనే ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ కనుమల్లోని గోవాకి వెళ్లే మార్గం పక్కగా కొన్ని కిలోమీటర్ల దూరంలో అడవుల్లో ఉన్న గ్రామాల్లోకి వెళ్లారు. ఉత్తర కన్నడ జిల్లాలోని జోయిడా తాలూకా పరిధిలోకి వస్తాయి ఖంగావ్, ఘట్కునాంగ్ గ్రామాలు. గ్రామాల ఎంపిక కోసం వాళ్లే ఓ సర్వే చేసుకున్నారు. ఒక్కొక్క మైలు దాటుతున్న కొద్దీ మట్టి రోడ్లు కూడా కనుమరుగైపోయాయి. అంతా బురదమయం. విద్యుత్ స్తంభాలు తీగెలెప్పుడో బై చెప్పేశాయి. ఇక ఈ మారుమూల గ్రామాలకు చేరుకునేసరికి అంధకార లోకంలోకి అడుగెట్టిన అనుభూతికి లోనయ్యారు. అసలే అటవీ ప్రాంతం సాయంత్రానికే చీకట్లు చుట్టుముట్టేశాయి. గ్రామస్తులంతా రైతు కూలీలే. దగ్గరి ప్రాంతాలు, గోవాకు వెళ్లి పనిచేసుకు వస్తుంటారు. వారి వెతలు తెలుసుకోవాలంటే వారితో కొన్ని రోజులు గడపాలని క్యాంప్ వేశారు. ''తొలి రాత్రే గాఢాంధకారం గుబులు రేపింది. రెండు రోజులు మనం ఉంటానికే చాలా ఇబ్బంది పడ్డాం. వీళ్లు నిత్యం ఎలా ఉండగలుగు తున్నారని'' మిత్రులు ఆ నిద్ర పట్టని రాత్రుళ్లు చర్చించుకున్నారు. సోలార్ విద్యుత్ వ్యవస్థ ఈ గ్రామం వెతల్ని తీరుస్తుంది కదా అని ఐడియా తట్టింది. అది కూడా తమ విద్యకు సంబంధించిన సబ్జెక్టే కదా అనుకుని ప్రాజెక్ట్‌గా ఆ గ్రామాల విద్యుద్దీకరణనే తీసుకున్నారు.
ప్రాజెక్ట్ 'బెలకు'
తమ కళాశాల యాజమాన్యాన్ని కలసి తమ ప్రాజెక్ట్ 'బెలకు' (వెలుగు) గురించి వివరించి 20 మంది ఈఈ ఫైనలియర్ విద్యార్థుల సాయం తీసుకున్నారు. ఆ గ్రామాల అవసరాలకు తగ్గట్టుగా ఓ సోలార్ విద్యుత్ వ్యవస్థకు తమ కళాశాల ల్యాబ్‌లో మెరుగులు దిద్దారు. లెక్చరర్ల ప్రోత్సాహంతో వారి ప్రాజెక్ట్‌కు సరిపడా సాంకేతికత అందింది. యాజమాన్యం ఇతర మిత్రుల అండదండలతో పరికరాల్ని సమకూర్చుకున్నారు. ప్రతి వారాంతాల్లో ల్యాబ్‌లో మిత్రులందరూ కలుసుకుని ఓ ప్రొటోటైప్‌ను రూపొందించారు. తొలుత కొందరు వెళ్లి ఓ ఇంట్లో దాని మన్నికను పరిశీలించి కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఆ రోజున ఆ సాయంత్రం ఆ కొత్త వెలుగులు గ్రామంలోని వారందరినీ వారి చుట్టూ వెలుతురు పురుగుల్ని చేశాయి. ఆ కొత్త వెలుగుకు చిన్నారులు కేరింతలు కొట్టారు. అదే వారి విజయ చిహ్నంగా భావించి మిత్రులు కళాశాలకు వెనుదిరిగారు. విజయాన్ని డిపార్ట్మెంట్ హెడ్‌కు వివరించారు. ప్రొటోటైప్‌ను చూసి మరో 20 వ్యవస్థల్ని తయారుచేశారు. ఒక్కొక్క దానికి 20 వేల రూపాయల ఖర్చయింది. ప్రతి వ్యవస్థలో ఒక ట్యూబ్‌లైట్, మూడు బల్బులు, ఒక 65 ఏహెచ్ బ్యాటరీ, 100 డబ్ల్యుపీ సోలార్ ప్యానెల్ ఉంటాయి. ఇవి ఒక సారి చార్జ్ అయితే రెండు రోజుల పాటు విద్యుత్ వెలుగులనిస్తాయి.
అందరూ కలసి ఆ గ్రామాలకు వెళ్లి సోలార్ విద్యుత్ వ్యవస్థను ఇళ్లలో అమర్చారు. కాగడాల వెలుగులో వ్యవస్థల అనుసంధానం పూర్తి చేశారు. వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలనే దానిపై అవగాహన తరగతులు నిర్వహించారు. కాస్తో కూస్తో ఎలక్ట్రీషియన్ పని తెలిసిన వ్యక్తికి పూర్తిస్థాయి శిక్షణనిచ్చి వాటి బాగోగుల్ని చూసుకునే బాధ్యతను అప్పజెప్పారు. ఇదంతా ఏప్రిల్ నాటికి పూర్తయ్యింది. తొలి సౌర దీపం వెలగగానే తమ జీవితాలు మారిపోయాయని గ్రామస్తులు ఉద్వేగంతో విద్యార్థులకు కృతజ్ఞతలు చెప్పారు. జీవితంలో అంత కన్నా గొప్ప రోజు మరోటి ఉండదని నలుగురు మిత్రులు కూడా తమ ఉద్వేగాన్ని పంచుకున్నారు. ఇప్పుడా ఉద్వేగమే మరి కొన్ని గ్రామాల్లో ఆనందోద్వేగాలు రేపనున్నాయి. కుక్కుట్టె, కిండాలె, కరంజీ, సౌలావలి, గౌలీవాడ, సులావలి, పద్షేట్ గ్రామాల్లో కూడా సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని పని ప్రారంభించారు. నిజమైన చదువు సంధ్యలంటే ఇవే.
.jpg)