‘యువగళం’ @ 3 వేల కిలోమీటర్లు

Dec 12,2023 10:18 #yuvagalam padayatra
  •  తేటగుంటలో పైలాన్‌ ఆవిష్కరించిన లోకేష్‌
  • హాజరైన లోకేష్‌ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం తేటగుంటకు వచ్చే సరికి మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ మజిలీకి గుర్తుగా యనమల గెస్ట్‌ హౌస్‌ వద్ద లోకేష్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, చిన్నల్లుడు భరత్‌, లోకేష్‌ కుమారుడు దేవాన్ష్‌, భార్య బ్రాహ్మణి పాల్గొన్నారు. 219 రోజుల్లో 92 నియోజకవర్గాల్లో 217 మండలాల గుండా యాత్ర సాగింది. ఈ యాత్రలో 70 బహిరంగ సభలు, 145 సమావేశాలను లోకేష్‌ నిర్వహించారు. తేటగుంట పద్మనాభ ఫంక్షన్‌ హాలు వద్ద ఆర్‌ఎంపి డాక్టర్లు ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రత్యేక మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసి ఆర్‌ఎంపిలను కమ్యూనిటీ మెడిక్స్‌గా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్‌.అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజిక తరగతి ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. కాపులను ఆర్థికంగా, రాజకీయంగా టిడిపి ప్రోత్సహించిందన్నారు. కాపు విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బిసిలకు ఇబ్బంది లేకుండా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. జగన్‌ కాపులను నమ్మించి ద్రోహం చేశారని విమర్శించారు. కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు అని చెప్పి, పది రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తునిలో భూదందా, ఇసుక అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి వడ్డీతో సహా మంత్రితో కట్టిస్తామన్నారు. పాదయాత్ర మధ్యలో దళిత నాయకులతో లోకేష్‌ మాట్లాడారు. జగన్‌ పాలనలో దళితుల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. రూ.28,147 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించి మోసగించారని విమర్శించారు. 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లాలో ముగిసి తాండవ బ్రిడ్జి మీదుగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోకి సోమవారం రాత్రి ప్రవేశించింది.

➡️