''అయ్యా.. నేను చదువుకుంటానయ్యా. ఆరేళ్ల ఆదెయ్య తండ్రి వైపు జాలిగా చూస్తూ అడిగాడు.
''ఒకటో తరగతి సదూతున్నావు గదరా? '' వీరాస్వామి అన్నాడు. దూరంగా ఉన్న ఆదెయ్య కుంటుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. తర్వాత నెమ్మదిగా.. ''అయ్యా మా బడిని పిల్లలు తక్కువైపోయారని ఎత్తేస్తున్నారట. పిల్లలందరూ పక్క ఊరిలో ఉన్న బడికి వెళ్లాలని సారు గారు చెప్పారు..'' ''వీరాస్వామి అయోమయంగా చూస్తూ.. బడి బాగానే ఉంది. ఎందుకు ఎత్తేస్తున్నారు?'' కొడుకుని అడిగాడు. ''అవునయ్యా.. మన బూరి బడిలో పిల్లగాళ్లు తగ్గిపోయారట. ఇక్కడ బడి అవసరం లేదని పక్క ఊరిలో ఉన్న పెద్ద బడిలో కలిపేసారట..''
''మరి మీ అయ్యగారు..?''
''అయ్యగారిని కూడా కొత్త బడికి పంపేస్తారట. రేపటి నుంచి కొత్త బడికి వెళ్లమని అయ్యగారు చెప్పారు.. అంత దూరం నడుచుకుని ఎలా వెళ్లాలో తెలియడం లేదయ్యా.. నాకు బడి మానేయాలని లేదయ్యా..'' ఆదెయ్య అమాయకంగా అన్నాడ వీరాస్వామికి అయోమయంగా అనిపించింది. రెండు కొత్త భవనాలు వాటి చుట్టూ ప్రహారీ కట్టారు భవనాలకు రంగులు వేసారు. పిల్లల కోసం మరుగుదొడ్లు, మంచినీటి బోరు నిర్మించారు గ్రామంలో ఉన్న పిల్లలు ఈ బడికి ఇష్టంగా వస్తున్నారు. అటువంటి పాఠశాలను ఎత్తివేయడం ఆశ్చర్యం అనిపించింది. ఏడేళ్ల ఆదెయ్య వైపు వాడి అవిటి కాళ్ల వైపు చూసాడు. వాడు పాఠశాలకు ప్రతిరోజూ నడుచుకుని వెళ్లలేని అశక్తత మొదటిసారి గుర్తుకు వచ్చింది '' అయ్యా.. కొత్త బడికి రోజూ నడుచుకుని వెళ్లలేనయ్యా.. కానీ నాకు బడికి వెళ్లి చదువుకోవాలని ఉందయ్యా..'' ఆదెయ్య అభ్యర్థించాడు ''ఆఫీసరు గారిని కలుద్దాం లే.'' వీరాస్వామి భరోసా ఇచ్చాడు
ొొొ
మండల విద్యాశాఖాధికారి కార్యాలయం లోపల ఆఫీసర్ రివాల్వింగు చైర్లో దర్జాగా కూర్చున్నాడు వీరాస్వామి కూలి పనికి ఎగనామం పెట్టి ఆదెయ్యను తీసుకుని వెళ్లాడు. ఆఫీసరు గది ముందు అరగంట నిల్చున్నా ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత అక్కడున్న అటెండరుని బతిమిలాడి లోపలికి వెళ్లాడు
'' ఎవరూ... ఏమి కావాలి ?
''ఆఫీసరు గారి ఆకారాన్ని చూసి ముందు వీరాస్వామి భయపడ్డాడు. తర్వాత కాస్త తమాయించుకుని అయ్యా.. మా పల్లిపేటలో బడిని ఎత్తేసారట.. '' అయితే ఏమిటి?''
''మా ఆదిగాడు అవిటోడు బాబు.. రోజూ కుంటుకుని బడికి ఎల్లలేడు.. రోజూ పక్కూరికి తీసుకెళ్లడానికి రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మావి..'' మండలాధికారి వీరాస్వామి వైపు సీరియస్‌గా చూశాడు. తర్వాత నెమ్మదిగా '' మీ ఊరిలో పిల్లలంతా కాన్వెంటులలో చేరిపోయారు. భూములకు రేటు రావడం వల్ల చాలామంది దబ్బులు బాగా సంపాదించారు అందుకే బస్సులలో దూరంగా ఉన్న కాన్వెంట్లకు తమ పిల్లల్ని పంపిస్తున్నారు.
నేనేం చేయాలి?
''మాలాంటి పేదోళ్లు ఎలా చదువుకోవాలి బాబూ'' ''మీ గ్రామంలో ఉన్న పాఠశాలను పక్కనున్న గ్రామంలో విలీనం చేశారు. అంటే కలిపేశారు. మీ ఊరివాళ్లు అక్కడికి వెళ్లి చదువుకోవచ్చు..
''ఉన్న ఊరిలో బడికి ఎల్లడానికే వాడు నానా అవస్థలు పడుతున్నాడు. ఇంక పక్కూరికి వెళ్లడం చాలా కష్టం. అంత దూరం వాడు నడపలేడు''.. '' నేను రోజూ మీ ఇంటికి వచ్చి మీ ఆదిగాడ్ని ఎత్తుకుని కొత్తబడికి తీసుకుని వెళతానులే..'' ఆఫీసరు పగలబడి నవ్వుతూ వెటకారంగా చెప్పాడు అందులో నవ్వవలసిన విషయం ఏముందో వీరాస్వామికి అర్థం కాలేదు. అయోమయంగా చూస్తుండిపోయాడు.
................................................
''ఉచితంగా పుస్తకాలిస్తున్నాం. స్కూలు డ్రస్సులు ఇస్తున్నాం. రోజూ మధ్యాహ్నం బడిలో భోజనం పెడుతున్నాం...బడికి వెళ్లడానికి ఇబ్బందేమిటి?'' వీరాస్వామి వైపు చూస్తూ విద్యాశాఖాధికారి అన్నాడు. '' నేను ఏమి చేయాలి బాబూ''
''ఏమి చేస్తావు. ఇక్కడి నుంచి దయచేయి. నాకు బోల్డు పనులున్నాయి'' అంటూ ఆఫీసరు టేబుల్‌పై కాగితాలను సర్దడం ప్రారంభించాడు. వీరాస్వామి నీరసంగా గది బైటికి వచ్చాడు '' అయ్యా.. మన ఊరిలో బడి మరి తెరుచుకోదా?''
ఆదెయ్య అమాయకంగా అడిగాడు. వీరాస్వామికి ఏమి సమాదానం చెప్పాలో అర్ధం కాలేదు. ఆదెయ్యతో కలిసి ముందుకు కదిలాడు.
0000 00000 00000 00000 గ్రామ సర్పంచి ఇల్లు ఇంటి బైట వరండాలో వరుసగా బల్లలు ఉన్నాయి. మరో పక్క కుర్చీలు ఉన్నాయి. వాటి పైన కొంతమంది గ్రామస్తులు కూర్చున్నారు. వీరాస్వామి కొడుకు ఆదెయ్యతో అక్కడికి వెళ్లాడు. బల్లలు ఖాళీగా ఉన్నప్పటికీ వీరాస్వామి ఒక బల్ల వెనుక నిల్చున్నాడు ఒక కాలుతో తాను నిల్చోవడం కష్టమని ఆదెయ్య బల్ల మీద కూర్చున్నాడు. అరగంట తర్వాత సర్పంచి ఇంటిలో నుంచి బైటికి వచ్చాడు అందర్నీ పలకరించిన తర్వాత దూరంగా నిల్చుని ఉన్న వీరాస్వామి దగ్గరకు వచ్చాడు ''ఏమికావాలి?'' అంటూ ప్రశ్నార్ధకంగా చూశాడు. '' మా ఊరిలో బడి ఎత్తేశారు. తమరే దయ చూడాలి..'' '' అవును బడిలో పిల్లలు తగ్గిపోయారని మీ బడిని పంచాయతీ కేంద్రంలో ఉన్న మా పాఠశాలలో కలిపేశారు. మీ ఊరిలో చదువుతున్న పిల్లలంతా రోజూ మా ఊరి బడికి రావాలి''. దర్జాగా చెప్పాడు సర్పంచి ''మా ఆదియ్య అవిటోడు...చిన్నప్పుడే పొలియోతొ ఒక కాలు చచ్చుబడి పొయింది.. రోజూ మా ఊరి నుంచి నడుచుకుని ఇక్కడకి రాలేడు ''అయితే ఏమిటి?''
''తమరే చెప్పాలి..''
''నలుగురైదుగురు పిల్లల కోసం మీ ఊరిలో బడిని నడపడం కష్టం.. అందుకే ఆ బడిని ఎత్తివేశారు..''.'' కొత్త భవనాలు కట్టారు. మరుగుదొడ్లు కట్టారు. తాగునీటికి బోరు వేయించారు. అవన్నీ వృధాయే కదండీ..'' వీరాస్వామి నెమ్మదిగా అన్నాడు ''వాటి సంగతి నీకు అసవరం...'' సర్పంచిలో కోపం
''అయితే, ఏమి చేయమంటారు బాబూ..''
''నువ్వు ఏ ఊరిలో ఉంటే ఏమిటి? కూలి పని చేసుకున్నోడికి ఏ ఊరు అయినా ఒకటే కదా?.. ఈ ఊరికి మకాం మార్చేరు'' సర్పంచి ఉచిత సలహా ఇచ్చాడు. '' అక్కడ మాకో చిన్న గుడిసె ఉంది. ఇక్కడికి వచ్చేస్తే ఎక్కడ ఉండగలం దొరా'' వీరాస్వామి ప్రశ్నార్ధకంగా అన్నాడు '' కొంపదీసి ఇల్లు కట్టించి ఇవ్వమంటావా?'' కోపంగా ప్రశ్నించి ముందుకు కదిలాడు ొొొ
ఆదియ్యకు అయోమయంగా ఉంది. వారం రోజులైంది బడికి వెళ్లి. ఊరిలో ఉన్న బడికి తాళం వేసి మూసివేశారు. అందులో చదువుతున్న పిల్లల్లో ఒకరిద్దరు పక్క గ్రామంలో పాఠశాలకు నడుచుకుని వెళుతున్నారు. ఆదెయ్య వంద మీటర్ల దూరం నడవాలన్నా చాలా కష్టపడాలి. తోటకూర కాడలా సన్నగా ఉన్న ఒక కాలుతో నడవడానికి చాలా కష్టపడవలసి వస్తోంది ఉన్న ఊరిలో బడి లేదు. దూరంగా ఉన్న పక్క గ్రామం బడికి నడుచుకుని వెళ్లలేడు. ఆటోలు ఇతర వాహనాలు కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా వాటి మీద రోజూ వెళ్లే స్థోమత కూడా ఆదెయ్యకు లేదు. ఏమి చేయాలో వాడి చిన్న మనసుకు తోచడం లేదు. తండ్రి వీరాస్వామి దూరంగా పొలంలో కూలి పని చేస్తున్నాడు. కుంటుతూ చాలా కష్టపడి తండ్రి పని చేస్తున్న పొలం దగ్గరికి వెళ్లాడు.
''అయ్యా..'' ''నెమ్మదిగా పిలిచాడు.
''ఏందిరా ఆదియ్యా .. ఇలా వచ్చావు?'' వీరాస్వామి అడిగాడు.
''అయ్యా.. ఇంటి దగ్గర ఊరికినే కూర్చోవడం ఏదోలా ఉంది.. అమ్మ కూడా కూలికి పోయింది. నేను ఒక్కడ్నే ఏమి చేయాలో తెలీడం లేదు. వీరాస్వామికి ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. తర్వాత నెమ్మదిగా..'' మన ఊరిలో మూసేసిన బడి కాడికెళ్లి కూర్చో.. పలక తీసి అక్షరాలు రాసుకో.. ఆకలేసినప్పుడు ఇక్కడికి..రా.. బువ్వ తిందువు అన్నాడు.''
అలాగే అయ్యా..ఆదియ్య కాళ్లుఈడ్చుకుంటూ దూరంగా ఉన్న బడికి చేరుకున్నాడు. గేటు తీసే ఉంది. అరుగు మీద ఒక మూల దుమ్ము దులిపి కూర్చున్నాడు.. పలక తీసుకుని బలపంతో గోడల మీద అందంగా రాసిన అక్షరమాలలో అక్షరాలను రాయడం మొదలు పెట్టాడు. ఏడాది నుంచి బడిలో చదువు తుండటం వల్ల ఏ అక్షరాలైనా చూసి రాయడం సులభంగా నేర్చుకున్నాడు. అందువల్ల గోడల మీద రంగులతో రాసి ఉన్న అక్షరాలకు తాను పలక మీద రాసుకున్నాడు. తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకున్నాడు. తాను రాసిన అక్షరాలు ఆదియ్యకు ఎంతో సంతృప్తి కలిగించాయి. తర్వాత పలకను తీసుకుని బడిలో ఉన్న బోరింగు నీటితో కడిగాడు. మళ్లీ వచ్చి కూర్చుని బడి గోడలపై ఉన్న బొమ్మలను కూడా పలక మీద గీశాడు పాఠశాల ముఖ ద్వారం వద్ద పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఒక వాక్యం ఆదెయ్యను ఎంతో ఆకర్షించింది. దాని కింద చిన్న బొమ్మ కూడా ఉంది ఆ బొమ్మ లో ఒక పెన్సిల్‌పై ఒక పక్క అమ్మాయి, మరో పక్క అబ్బాయి కూర్చున్నట్టుగా ఉంది. ఆ పదాలకు అర్థం వాడికి తెలియలేదు. అయినప్పటికీ దానిని కూడా పలక మీద రాయాలని అనుకున్నాడు. చాలా కష్టపడి ఆ పదాన్ని పలక మీద జాగ్రత్తగా రాశాడు. అక్షరాలు చిందరవందరగా వచ్చాయి. అయినప్పటికీ తప్పులు లేకుండా రాయగలిగాడు ఆ వాక్యం
''అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి''.
====000=====
- పొత్తూరు రాజేంద్రప్రసాద్‌వర్మ
సదూకుంటానయ్యా (కథ)
