మ్యాంగో ఐస్ క్రీమ్
కావాల్సిన పదార్థాలు
క్రీమ్ -230 గ్రాములు
పాలు -500 మి.లి
పంచదార - 150 గ్రాములు
మామిడి గుజ్జు 250 గ్రాములు
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (వెన్నతీసిన పాల పొడి) - 50 గ్రాములు
తయారుచేసే విధానం
ముందుగా మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టి మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ బాగా కలపాలి. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ కూడా వేసి కొద్దిసేపు కలపాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఎంత బాగా చల్లారితే ఐస్ క్రీమ్ అంత మృదువుగా ఉంటుంది. పాల మిశ్రమం చల్లారాక మామిడి గుజ్జు వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి 15 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రిజ్‌లో పది గంటలు ఉంచాలి. తర్వాత ఫ్రిజ్‌లో నుండి ఐస్‌క్రీమ్ కప్పుల్ని బయటకు తీసి మామిడి ముక్కలతో అలంకరించి వచ్చిన అతిధులకు సర్వ్ చేయండి.
వెనిల్లా ఐస్ క్రీమ్
కావాల్సిన పదార్థాలు
పాలు - 1 1/2 లీటర్
పంచదార - 1 కప్పు
క్రీమ్ - 15 మి.లి
గుడ్లు - 6 (పచ్చ సొన మాత్రమే)
వెనిల్లా ఎసెన్సు - 1/2 టీి స్పూన్
తయారుచేసే విధానం
ముందుగా పాలను ఒక పాత్రలో వేసి చిక్కగా అయ్యేంత వరకు కాగపెట్టాలి. పాలు చల్లారిన తర్వాత అందులో గుడ్లలోని పచ్చసొన, పంచదార వేసి బాగా కలపాలి. పంచదార బాగా కరిగే వరకు గిలకొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో చల్లారిన పాలను కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి సన్నని సెగమీద మరిగేప్పుడు అందులో మరి కొన్ని పాలు పోయాలి. మరిగిన పాలలో ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని పోసి కలుపుతూ అది చిక్కబడే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత క్రీమ్, వెనిల్లా ఎసెన్సు వేసి బాగా కలిపి ఐస్ క్రీమ్ మోల్డ్ లో పోసి ఫ్రిజ్‌లో పెట్టకోవాలి. బాగా గట్టి పడిన తర్వాత ఫ్రిజ్‌లో నుండి తీసి వెనిల్లా ఐస్‌క్రీమ్‌ని పిల్లలకు అందించండి.
క్యారెట్ ఐస్‌క్రీమ్
కావాల్సిన పదార్థాలు
క్యారెట్ జ్యూస్ - 2 కప్పులు
పాలు - 2 కప్పులు
పంచదార- 2 కప్పులు
క్రీమ్ - 1 కప్పు
బాదం పప్పు- 4 టేబుల్ స్పూన్లు
పిస్తా పప్పు - 4 టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం
పాలలో చక్కెర వేసి కలిపి స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. కొద్ది పాలలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమంలో మరికొన్ని పాలను పోసి చిక్కగా అయ్యేవరకు ఉంచాలి. పాలు చిక్కగా అయ్యాక క్రీమ్ వేసి కలపాలి. పది నిమిషాలు మరగనిచ్చి అందులో క్యారెట్ జ్యూస్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మరింత చిక్కగా అయ్యే వరకు మరిగించి దించేసుకోవాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీలో బ్టైండ్ చేసుకోవాలి. తర్వాత చిన్న కప్పుల్లో ఈ మిశ్రమాన్ని ఉంచి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. గంట తర్వాత బైటికి తీసి ఐస్ క్రీమ్ పై బాదం, పిస్తాలను ఉంచి వేసవిలో వచ్చే అతిధులకు క్రీమ్‌ని అందించండి.


