పుట్టగొడుగుల పెంపకంతో ఆదనపు ఆదాయం
ప్రజాశక్తి - కడపఅర్బన్
అన్నదాతలు సంతోషంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని, పుట్టగొడుగుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని వైవీయూ విసి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం సి.వి.రామన్ సైన్స్ భవన్లో పుట్టగొడుగుల పెంపకం సాగు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవ సాంకేతిక శాఖ ఆచార్యులు కన్వీనరు చంద్రమతి శంకర్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టగొడుగుల పెంపకం మంచి ఆదాయంతో పాటు నిరుద్యోగ సమస్యను తీరుస్తుందని పేర్కొన్నారు. రైతుల వద్ద ఉన్న వ్యవసాయ తరవాత ఏర్పడిన చెత్తను ఉపయోగించి పుట్ట గొడుగులను ఉత్పత్తి చేసి ఆదనపు ఆదాయం పొందవచ్చని తెలి పారు. పుట్టగొడుగుల పెంపకపంపై శాస్త్రీయ అవగాహన పొంది సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి, ఎక్కువ ఆదాయం పొందవచ్చని చెప్పారు. విద్యార్థుల పరిశోధనలు రైతుల ప్రయోజనం కోసం జరగాల్సి ఉందన్నారు. రైతులు, విద్యార్థులు ఒకచోట చేరి సదస్సులో పాల్గొని ఆలోచనలు పంచుకునే అవకాశం కల్పించిన బయోటెక్నాలజీ శాఖ ఆచార్యులు చంద్రమతి శంకర్‌ను అభినందించారు. రిజిస్ట్రార్ చంద్రయ్య మాట్లాడుతూ గతంలో వర్షాకాలంలో మాత్రమే పుట్టగొడుగులు చూసేవారమని నేడు అన్ని కాలాల్లో అవి లభిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా అత్యధిక శాతం ప్రోటీన్లను కలిగి ఉన్నాయన్నారు. పుట్టగొడుగుల పెంపకం రైతులకు మంచి ఆదాయవనరు అని వివరించారు. ప్రిన్సిపల్ గులాం తారిఖ్ మాట్లాడుతూ రైతుల కోసం వైవీయూలో నిపుణులతో సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి.రంజిత మాట్లాడుతూ పుట్టగొడుగుల సాగునకు కావాల్సిన సామాగ్రి, పుట్టగొడుగుల రకాలు, పెంచే విధానం, తీసుకువాల్సిన జాగ్రత్తలు, వ్యాధుల నివారణ అంశాలను వివరించారు. ఉత్పత్తి తరువాత మార్కెట్ మెళకువలను రైతులపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సు కన్వీనరు ఆచార్య చంద్రమతి శంకర్ మాట్లాడుతూ సదస్సు ఉద్ధేశాన్ని వివరించారు. కార్యక్రమంలో సదస్సు కో-కన్వీనరు డాక్టర్ ఎ.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పుట్టగొడుగుల పెంపకంతో ఆదనపు ఆదాయం
