యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
ప్రజాశక్తి - కలసపాడు
యువత చేతుల్లోనే భారతదేశ భవిష్యత్తు అధారపడి ఉందని పశ్చిమ రాయలసీమ ఉపాధాయ శాసనమండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో దాతల సహకారంతో నెలకొల్పిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎపిజె అబ్దుల్ కలాం విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి వారికి కొంత సమయం కేటాయించాలని చెప్పారు. దేశ నాయకుల జీవిత చరిత్రను నీతి కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందుతాయన్నారు. సమగ్ర శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉన్నారన్నారు. పాఠశాలను సుంధరంగా తీర్చిదిద్ధిన ప్రధానోపాధ్యాయుడు ముత్తుముల రామకృష్ణారెడ్డి అభినందించారు. పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలందరినీ ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు ఎం.రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జడ్పిటిసి సగిలి సుదర్శన్, ఎంఇఒ ఎం.శ్రీనివాసులు, ఎస్ఎస్ఎ ఎఎంఒ పరుశురాం, ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వెంకటసుబ్బారెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు ఎస్.మస్తాన్వలి, ఎ.కొండుశెట్టి, గ్రామ పెద్దలు, విద్యాకమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
