ప్రజాశక్తి - భీమడోలు
పెట్రోలు, డీజిల్ ధరల నియంత్రణ కోరుతూ ఈ నెల పదో తేదీన దేశవ్యాప్తంగా జరిగే బంద్‌లో భాగంగా సిపిఎం, జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే భీమడోలు బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయా పార్టీల నాయకులు కోరారు. ఈ మేరకు భీమడోలు సిపిఎం కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నేత లింగరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను నిర్ణయించాల్సి ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టి పన్నుల భారం మోపి ధరలను సామాన్యులకు అందుబాటులో లేకుండా పెంచుతున్నాయని విమర్శించారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ బంద్ కార్యక్రమంలో భాగంగా భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులతో పాటు జనసేన నాయకులు నిమ్మకాయల గణ, కేశిరెడ్డి లక్ష్మణ్, బొమ్మ మహేష్, తమ్మన రామకష్ణ, పి.మణిరాజు పాల్గొన్నారు.
నిడమర్రు : పెరిగిన పెట్రో ధరలతో పాటు పాలకుల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా గణపవరంలో సోమవారం జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం.ఆంజనేయులు పిలుపునిచ్చారు. బిటి.రణదేవ్ భవనంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం, సిపిఎ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు, కె.త్రినాధ్, ఎన్.రమణారావు, ఎస్.చంద్రయ్య, జనసేన నాయకులు పెద్దిరాజు, రామ్‌కుమార్, గిరి, నాగరాజు పాల్గొన్నారు.
పెట్రో ధరల పెంపుపై నేడు బంద్
