ప్రజాశక్తి-బద్వేల్ అర్బన్
రాష్ట్ర వ్యాపితంగా ఉన్న డప్పు కళాకారులు దయనీయ స్థితిలో ఉన్నారని, ఈ కళను ప్రాచీన కళగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్అండ్బి అతిథి గృహం నుంచి సుమారు వంద మంది డప్పు కళాకారులతో తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని పది పంచాయతీల్లో 40 గ్రామాల్లో దళితులున్నారని పేర్కొన్నారు. వీరిలో 300లకు పైగా దళితులు డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్నారని తెలిపారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళితులు జాతరలు, బోనాలు, వినాయక చవితి ఊరేగింపులు, శుభకార్యాలు, అశుభ కార్యాలకు డప్పులు వాయించి ప్రజలు ఇచ్చే అరకొర డబ్బులతో దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. అరకొర బత్యాలిస్తూ కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రాచీన కళగా గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్థిక సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో డప్పు కళాకారులు సంఘం జిల్లా నాయకులు నారాయణ, మండల కన్వీనర్ బాలసిద్ధయ్య, నాయకులు జయన్న, గురయ్య, జగన్, దానం , రాజన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లం కొండయ్య పాల్గొన్నారు.
డప్పుకళను ప్రాచీనకళగా గుర్తించాలి
