* వాతావరణ మార్పులపై ఐరాస ఛీఫ్ హెచ్చరిక
మాడ్రిడ్: వాతావరణ మార్పులతో మనం 'అడ్డుకోలేని ముప్పు' కనుచూపు మేరలో పొంచి వున్నదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ ప్రారంభమైన వాతావరణ మార్పుల సదస్సులో ఆయన మాట్లాడుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్న హరితగృహ వాయువు (గ్రీన్హౌస్ గ్యాసెస్)ల విడుదలను కట్టడి చేయటంలో అగ్రరాజ్యాల వైఫల్యాన్ని ఆయన విమర్శించారు. ఈ దిశగా అగ్రరాజ్యాలు చేపడుతున్న చర్యలు 'ఏ మాత్రం సరిపోవ'ని ఆయన స్పష్టం చేశారు. అగ్రరాజ్యాలంటూ ఆయన దేశాల పేర్లను ప్రస్తావించనప్పటికీ, పారిస్ ఒప్పంద రూపకర్త, యూరోపియన్ క్లైమెట్ ఫౌండేషన్ సిఇఓ లారెన్స్ టుబియానా కొన్ని దేశాలను పరోక్షంగా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఈ ఒప్పందం నుండి వైదొలగటం ద్వారా పర్యావరణ పరిరక్షణపై తనకున్న అనాసక్తిని తెలియచేశారని విమర్శించారు. అయితే కొన్ని దేశాలు మినహా ప్రపంచ దేశాలన్నీ పారిస్ ఒప్పందంలో ఇచ్చిన హామీలను నిలుపుకున్నాయని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుత పారిశ్రామిక స్థాయిలు ఇలాగే కొనసాగితే మరికొన్నేళ్లలో భూమండల ఉష్ణోగ్రతలు కనీసం మూడు డిగ్రీల సెల్షియస్ మేర పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేసేందుకు సిద్ధమైన దేశాలలో కూడా ఇప్పటికే ఒక డిగ్రీ సెల్షియస్ ఉష్ణోగ్రత పెరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ముప్పును కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో సోమవారం నాడు చర్చలు కొనసాగినప్పటికీ, సంబంధిత విధి విధానాలపై ప్రపంచ దేశాలు సరిగా దృష్టి పెట్టటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
భద్రతా విధుల్లో 5 వేల మంది పోలీసులు
ఆదివారం ఇక్కడ ప్రారంభమైన ఐరాస వాతావరణ మార్పుల సదస్సు భద్రత కోసం స్పెయిన్ ప్రభుత్వం దాదాపు 5 వేల మందికి పైగా పోలీసు అధికారులను రంగంలోకి దించింది. సివిల్ గార్డులు వాహనాల రాకపోకలను, విమానాశ్రయ భద్రతను నియంత్రిస్తుండగా, రక్షణ మంత్రిత్వశాఖ గగనతల భద్రతను పర్యవేక్షిస్తోంది.