ఐక్యరాజ్యసమితి/జెరూసలేం : వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ కొత్త సెటిల్మెంట్లను నిర్మించటాన్ని సమర్ధించిన అమెరికా వైఖరిని ఐరాస భద్రతా మండలి సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఇజ్రాయిల్ ఈ సెటిల్మెంట్లను నిర్మిస్తుండటం, దానిని అమెరికా సమర్ధించటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మండలిలోని 14 సభ్యదేశాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. అమెరికా అనుసరిస్తున్న ఈ వైఖరి ఇజ్రాయిల్-పాలస్తీనా ఘర్షణకు రెండుదేశాల పరిష్కారాన్ని కాల రాస్తుందని ఈ దేశాలు హెచ్చరించాయి. అమెరికా మద్దతుపై ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించిన రెండు రోజుల తరువాత బుధవారం జరిగిన మండలి నెలసరి భేటీలో ఈ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వెల్లడయింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ దేశాలు ఇజ్రాయిల్ సెటిల్మెంట్ల నిర్మాణం అంతర్జాతీయ చట్ట ప్రకారం నేరమేనని తమ ప్రకటనలో స్పష్టం చేశాయి. అయితే అమెరికా నిర్ణయాన్ని గట్టిగా సమర్థి ంచిన ఇజ్రాయిల్ రాయబారి డేనీ డానన్ మాట్లాడుతూ ఈ నిర్ణయం ద్వారా అమెరికా చారిత్రిక తప్పిదాన్ని సరి చేసిందన్నారు. ఇజ్రాయిల్ కార్యకలాపాలు అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమని మండలి భేటీ ప్రారంభం కావటానికి ముందు అమెరికా మిత్ర దేశాలయిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోలండ్లు ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.
యుద్ధనేరాన్ని సమర్ధిస్తున్న అమెరికా: ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీ విమర్శ
వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను అమెరికా సమర్ధించటం యుద్ధ నేరాన్ని సమర్ధించటమే అవుతుందని ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. 1967లో ఆక్రమించుకున్న ఈ పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ చేపట్టిన ఈ నిర్మాణాలు అంతర్జాతీయ చట్ట నిబంధనలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని కాలరాస్తూ నెతన్యాహు సర్కారు చేపట్టిన ఈ నిర్మాణాలకు అమెరికాలోని ట్రంప్ సర్కారు మద్దతునివ్వటం బాధాకరమని ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాక ఈ నిర్మాణ కార్యకలాపాలు పాలస్తీనా ఏర్పాటును అడ్డుకునే యుద్ధ నేరాలు అవుతాయని స్పష్టం చేసింది.