వాషింగ్టన్ : భారత్లోజరగుతున్న ఎన్ఆర్సి ప్రక్రియపై అమెరికా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ వలన అస్సాంలో దాదాపు 19 లక్షల మంది త్వరలో నిరాశ్రయులు కాబోతున్నారని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (యుఎస్సిఐఆర్ఎఫ్) కమిషనర్ అనురిమ భార్గవ మంగళవారం తెలిపారు. జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సి) ప్రక్రియలో మత స్వేచ్ఛ చిక్కులపై యుఎస్సిఐఆర్ఎఫ్ అధ్యయనం జరిపి నివేదికను రూపొందించింది. అస్సాంలో నిష్పాక్షికత, పారదర్శకత, నియంత్రణ లేకుండా చేపట్టిన ఎన్ఆర్సి ప్రక్రియ కారణంగా లక్షలాది మంది పౌరసత్వాన్ని కోల్పోతున్నారని ఆరోపిస్తూ, ముస్లిం జనాభాను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేసింది. ''అస్సాంలో ముస్లింలను బయటకు వెళ్ళగొట్టడం, వారిని వేరుచేసే ఉద్దేశ్యంతోనే ఎన్ఆర్సి ప్రక్రియను చేపట్టినట్లు అధికారంలోని రాజకీయ నాయకులు పదేపదే తెలియచేయడం మరింత భయంకర విషయం. ఇప్పుడు దేశమంతటా ఎన్ఆర్సిని విస్తరించడానికి, ముస్లింలకు వేరు వేరు పౌరసత్వ ప్రమాణాలను అమలు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు'' అని భార్గవ తెలిపారు. ఎన్ఆర్సిని అప్డేట్ చేయడం, భారత ప్రభుత్వపు తదుపరి చర్యలు అణగారిన ముస్లిం జనాభాను లక్ష్యంగా చేసుకుని ''పౌరసత్వం కోసం మత పరీక్ష''ను సృష్టించేదిగా ఉందని యుఎస్సిఐఆర్ఎఫ్ అధ్యక్షుడు టోని పెర్కిన్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మతపరమైన మైనార్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎన్ఆర్సిపై అమెరికా సంస్థ ఆందోళన
