బ్రసాలియా/ బీజింగ్ : బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమైన అనంతరం సరిహద్దు వివాదానికి సంబంధించి మరో సమావేశం నిర్వహించడానికి భారత్-చైనాలు అంగీకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, చైనా జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వంలో 21వ దఫా భారత్ -చైనా సరిహద్దు చర్చలు గత ఏడాది నవంబర్‌లో చైనాలోని చెంగ్డులో జరిగిన సంగతి తెలిసిందే. సరిహద్దుకు వివాదానికి సంబంధించి మరో సమావేశం నిర్వహించనున్నారని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారని విదేశాంగ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి సంబంధించి షెడ్యూల్‌ను పేర్కొనలేదు. 11వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోడీ, జిన్‌పింగ్‌లు బ్రెజిల్లో సమావేశమయ్యారు. సరిహద్దు వివాదంపై ముందస్తు పరిష్కారం కోసం చర్చలను తీవ్రతరం చేసేందుకు ఇరుపక్షాలు సంకల్పించాయని చర్చల అనంతరం విడుదల చేసిన ఒక అధికార ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతి, భద్రతలను కాపాడుకునేం దుకు ఇరు దేశాలకు చెందిన భద్రతా దళాల మధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలని ఇరు నేతలు ఉద్ఘాటించారు.
సరిహద్దు వివాదంపై భారత్-చైనా మరో సమావేశం.. !
