* అధికారుల చెరలో 70వేల మంది వలస చిన్నారులు
వాషింగ్టన్ : అమెరికాలో అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సరిహద్దు భద్రతా దళాలను ఆదేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి ఆదేశాల మేరకు అమెరికా సరిహద్దుకు చేరుకున్న వలసదారులను ఆదేశ బలగాలు అదుపులోకి తీసుకుంటున్నాయి. అంతర్యుద్ధాల కారణంగా నిరాశ్రయులై ప్రాణభయంతో వలసబాట పట్టిన శరణార్థుల దగ్గర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఉండే అవకాశముండదు. దీన్ని ఆసరాగా చేసుకొని సరైన ధ్రువీకరణ పత్రాలు చూపాలంటూ వలసదారులపై సరిహద్దు భద్రతా బలగాలు ఒత్తిడి తెస్తున్నాయి. అంతేగాకుండా, వలసదారుల నుంచి పిల్లలను వేరుచేసి నిర్బంధిస్తున్నాయి. గతేడాది అమెరికా అధికారుల చెరలో 70వేల మంది వలసదారుల చిన్నారులు ఉన్నట్టు యూఎన్ రిసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది. వలసదారుల చిన్నారుల పట్ల బోర్డర్ సెక్యూరిటీ అమానుషంగా ప్రవర్తించేవారని తెలిపింది. వలసదారుల చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. వీరందరిని తక్షణమే విడుదల చేయాలని ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చారు. పలు వలసదారుల నిర్బంధ కేంద్రాలను ఆమె స్వయంగా సందర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఎన్ఎఫ్ఎల్ స్టేడియంలో నిర్బంధించిన చిన్నారులను అధికారులు వదిలిపెట్టారని యూఎన్ రిసెర్చ్ సంస్థ తెలిపింది. ఫెడరల్ చట్టాల ప్రకారం.. వలసదారుల చిన్నారులకు ఆహారం, మందులు అందించాలి. చిన్నారులన వైద్యులు పర్యవేక్షించాలి. అయితే, సరిహద్దు భద్రతా బలగాలు మాత్రం వీరి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించేవారని తెలిపింది. అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలతో పాటు చిన్నారుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని యూఎన్ రిసెర్చ్ సంస్థ పేర్కొంది.
అమెరికాలో అక్రమ నిర్బంధాలు
