లాపాజ్/వాషింగ్టన్: ప్రతిపక్షాలు కుట్రలు, నిరసనల మధ్య బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం, పోలీసులు మితవాద శక్తులకు కొమ్ముకాయడం, ఆందోళనకారులు పెద్దయెత్తున విధ్వంసానికి దిగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మొరేల్స్ చేత బలవంతంగా రాజీనామా చేయించిన మితవాద గ్రూపుల చర్యను క్యూబా, వెనిజులా, అర్జెంటీనా, మెక్సికో తదితర దేశాల అధినేతలు ఖండించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా కూడా ఖండించారు. మొరేల్స్కు వారు తమ సంఘీ భావాన్ని ప్రకటించారు. రాజీనామా అనంతరం ప్రభుత్వ టెలివిజన్లో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మొరేల్స్ 'నా ప్రత్యర్థులైన కార్లోస్ మెసా, లూయిస్ ఫెర్నాండో కమాచోలు ఇకపై తన సోదర సోషలిస్టు నేతలపై బురద చల్లేందుకు వీలు లేకుండా చేసేందుకే దేశాధ్యక్ష పదవి నుండి తాను తప్పుకుంటున్నాను' అని చెప్పారు. దేశంలో కొనసాగుతున్న హింసాకాండకు ఇకనైనా ప్రతిపక్షాలు స్వస్తి పలకాలని మొరేల్స్ కోరారు. దేశాధ్యక్షుడిగా దేశ ప్రజలందరి సంతృప్తి మేరకు పనిచేయటం తన బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతిపక్షం తన సందేశాన్ని అర్ధం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను రాజీనామా చేసినంత మాత్రాన సోషలిజం ఓడిపోయినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. మొరేల్స్ రాజీనామా ప్రకటించిన కొద్దిసేపటికే ఉపాధ్యక్షుడు అల్వారో మార్సేలా గార్షియా లినేరా కూడా తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆ తరువాత కొద్దిసేపటికే సెనేట్ అధ్యక్షుడు ఆడ్రియానా సాల్వటిరా కూడా రాజీనామా చేశారు. అక్టోబరు 20 ఎన్నికల్లో మొరేల్స్ విజయం సాధించినట్లు ప్రకటన వెలువడినప్పటి నుంచి అమెరికా మద్దతు ఉన్న ప్రతి పక్షాలు ఈ ఎన్నికలు బూటకమంటూ నిరసనలు, ఆందోళనలకు దిగాయి. అశాంతిని రెచ్చగొట్టాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మొరేల్స్ అధ్యఓ ఎన్నికలు తిరిగి నిర్వహించాలని నిర్ణయించారు. మొరేల్స్ తన పదవికి రాజీనామా ప్రకటించిన వెంటనే ఆయన, తన రాజకీయ సలహాదారులు, సహచరులతోకలిసి కొచబాంబా నగరానికి విమానంలో బయల్దేరి వెళ్లినట్లు బొలీవియన్ టీవీ ఛానల్స్ తమ వార్తా కథనాలలో వెల్లడించాయి. 2006 నుండి బొలీవియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎవో మొరేల్స్ దేశంలోని గనులు, ఇతర సహజ వనరులపై అమెరికా కంపెనీల పెత్తనాన్ని అంతమొందించి, ప్రభుత్వ అధీ నంలోకి తీసుకొచ్చారు. పలు ప్రజానుకూల చర్యలు చేపట్టా రు. అమెరికా విదేశాంగ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే మొరేల్స్ నాలుగోసారి దేశాధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అనుమతిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
కుట్రదారులపై పోరు ఇంతటితో ఆగదు: మొరేల్స్
ప్రజలెన్నుకున్న ప్రభుత్వ వ్యతిరేక కుట్రదారులపై తన పోరు ఇంతటితో ఆగబోదని మొరేల్స్ స్పష్టం చేశారు. శాంతి, సమానతల కోసం పేదలు, ఇతర వర్గాల ప్రజలు దేశ భక్తులు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయన చెప్పారు. తప్పుడు ప్రచారంతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని తాను ప్రత్యర్థులను, ఇతర పౌర సంఘాలను కోరుతున్నానన్నారు. తాను బొలీవియా ప్రజలను అత్యధికంగా గౌరవించానని, తమ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అరాచకశక్తులు పన్నుతున్న కుట్రలను ప్రపంచం గమనించాలని తాను కోరుతున్నానని ఆయన చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేక కుట్రకు అమెరికా సాయం
బొలీవియాలో ప్రభుత్వ వ్యతిరేక కుట్రకు అమెరికా సాయం అందిస్తోందని లాటిన్ అమెరికా ఉద్యమ కార్యకర్త మెడియా బెంజమిన్ అభిప్రాయపడ్డారు. బొలీవియాలో జరిగిన ఎన్నికలను లాటిన్ అమెరికా దేశాల సంస్థ (ఒఎఎస్) ప్రశ్నిస్తోందని, దీనిపై అంతర్జాతీయ పరిశీలనకు, తాజా ఎన్నికలకు అధ్యక్షుడు మొరేల్స్ అంగీకరించారని ఆయన ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజలతో ఎన్నికైన అధ్యక్షుడికి మద్దతు ఇవ్వటానికి బదులుగా పోలీసులు, సైన్యం అరాచకశక్తులతో చేతులు కలిపి ఆయన రాజీనామాకు వత్తిడి చేశాయని, ఇది ప్రజాస్వామ్యయుతం కాదని, ఇది కుట్ర మాత్రమేనని ఆయన తన ట్వీట్లో స్పష్టం చేశారు.