ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీ

Feb 4,2024 15:37 #Cancer, #Tirupati district

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా తిరుపతిలో అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని, వ్యాధిని ముందుగానే గుర్తించి ముదరక ముందే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని, క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రపంచ క్యాన్సర్ డే 2024 సందర్భంగా ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణ బాబు పేర్కొన్నారు. స్విమ్స్ పద్మావతి వైద్య కళాశాల నుండి స్విమ్స్ ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వరకు క్యాన్సర్ అవేర్నెస్ వాక్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, సర్జికల్ ఆంకాలజీ స్పెషల్ ఆఫీసర్ జయచంద్రారెడ్డి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ ను నయం చేయడం కష్టం అని అందరికీ తెలుసు అని, కానీ కాన్సర్ నివారణ చాలా ముఖ్యం అని, దానిని ముదరకుండా ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం అని దీనిపై గ్రామ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని క్యాన్సర్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఆరోగ్య కార్యకర్తపై, మన అందరిపై ఉందని తెలిపారు. మన దేశంలో సంవత్సరానికి 14 నుండి 15 లక్షల మధ్య క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 7 నుండి 8 లక్షల మంది చనిపోతున్నారు. మన రాష్ట్రంలో సంవత్సరానికి 60 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు వారిలో సుమారు 30 వేల మంది చనిపోతున్నారు అని తెలిపారు. క్యాన్సర్ చాలా ఖరీదైన చికిత్స అని, చాలా మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం జరిగిందనీ, అయినప్పటికీ చాలా మంది ప్రాణాలు పోతుండండం వ్యాధి ముదరడం నుండి జరుగుతోందని అన్నారు. కాబట్టి క్యాన్సర్ ముదరక ముందే క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చర్యలు చేపడితే వారి ప్రాణాలు కాపాడిన వారమైతామని తెలిపారు. సంతులిత ఆహారం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జంక్ ఫుడ్ తినకుండా ఉండడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చు అన్నారు. మగ వారిలో ఆల్కహాల్ ధూమపానం ద్వారా క్యాన్సర్ రావొచ్చు అని, ఓరల్ క్యాన్సర్, ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమం నేడు తిరుపతి జిల్లా నుండి ప్రారంభిస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది. స్విమ్స్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పింక్ బస్సులు గ్రామ స్థాయి వరకు వెళ్లి క్యాన్సర్ అనుమానితులను స్క్రీనింగ్ చేయడం, వారిలో క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి అధునాతన చికిత్స కొరకు పై హాస్పిటల్ లకు పంపడం జరుగుతుందని, గౌ. ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా ప్రతి కుటుంబానికి వెళ్లి జల్లెడ పట్టినట్లుగా అందరికీ వైద్య ఫలాలు అందేలా పనితీరు ఉండాలని సూచించారు. పింక్ బస్సు గ్రామానికి వెళ్ళే తేదీ సమయం షెడ్యూల్ అన్నీ వివరంగా ముందుగానే గ్రామంలో సంబంధిత వైద్య సిబ్బంది, వాలంటీర్లు ద్వారా ప్రతి ఇంటికి తెలుపబడితుందని, ఒక సమగ్ర వివరాలతో కూడిన ఒక ఫార్మాట్ నందు వారి వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేసి అనుమానితులను పింక్ బస్ వద్ద తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించ బడతాయని, ఎవ్వరూ కూడా మొహమాటం కి పోయి పరీక్ష చేయించుకోకుండ ఉండరాదని కోరారు. నిర్ధారణ అయిన వారిని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకు వచ్చి మంచి చికిత్స అందిస్తారని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ అనుబంధంగా ఏర్పాటుతో ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వైద్య శాఖలో పలు రకాల ఖాళీలు భర్తీ చేయడం జరిగిందని, ప్రతి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే కాకుండా స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు , విద్యావేత్తలు, మీడియా ప్రజల్లో అవగాహన కల్పించుట లో భాగస్వాములు కావాలని సూచించారు. తిరుపతి జిల్లాలో టీటీడీ ఎంతో గొప్ప సహకారం అందించి క్యాన్సర్ ట్రీట్మెంట్ కు స్విమ్స్ పూర్తిస్థాయిలో ఆసుపత్రి అందుబాటులో వస్తున్నందుకు వారికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేసారు. మొదటి దఫా గా తిరుపతి, అనకాపల్లి రెండు జిల్లాలో ముందుగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అలాగే కేజీహెచ్, గుంటూరు, స్విమ్స్ ఈ మూడు రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా లెవెల్ 1 గా ఏర్పాటు చేయబోతున్నామని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగం లెవెల్ 2 ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇందులో సక్రమంగా వినియోగించాలని సూచించారు. స్విమ్స్ ఒక గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మంచి పేరుతో నిలవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ డే 2024 నేపథ్యంలో అవగాహణ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగిందనీ అన్నారు. అలాగే స్విమ్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో నేడు తిరుపతి జిల్లా నుండి రాష్ట్ర స్థాయి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామ స్థాయి వరకు క్యాన్సర్ పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, క్యాన్సర్ రాకుండా నివారణ ముఖ్యం అని, క్యాన్సర్ బారిన పడిన వారిని ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడిన వారము ఐతామని, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధికి ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, ముందుగానే గుర్తించడం ద్వారా క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని అవగాహన చాలా ముఖ్యమని, ప్రజలు, విద్యావేత్తలు, వైద్యులు, మీడియా అందరూ క్యాన్సర్, వాటి లక్షణాలు, గుర్తించడం, చికిత్స వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. స్విమ్స్ పద్మావతి మహిళా వైద్య కళాశాల లో క్యాన్సర్ చికిత్సకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం వ్యాస రచన, చిత్రలేఖనం తదితర పోటీలలో మంచి ప్రతిభ చూపిన కళాశాల విద్యార్థినులకు ప్రసంశా పత్రాలు అందజేశారు. అతిథులు ప్రసంగాలకు ముందు కళాశాల విద్యార్థినులు తయారు చేసిన చిత్ర ప్రదర్శనను వారు తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, స్విమ్స్ సూపరింటెండెంట్ రామ్, డిపిఎంఓ శ్రీనివాసులు, ఇతర వైద్యాధికారులు సిబ్బంది, కళాశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

➡️