- రట్టు చేసిన కొలంబియా నిఘా వర్గాలు
కారకాస్ : వెనిజులా ప్రజలను ఆదుకునేందుకు సేకరించిన మానవతా సాయాన్ని అక్కడి విపక్షం దుర్వినియోగం చేసిన వైనాన్ని కొలంబియా నిఘా వర్గాలు రట్టు చేశాయి. గత జనవరిలో తనను తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విపక్షనేత జువాన్గైడో అమెరికా, ఇతర పశ్చిమదేశాల మద్దతుతో అక్కడి మదురో సర్కారును గద్దెదించేందుకు పలుమార్లు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. వెనిజులా ప్రజలను ఆదుకునేందుకు గత ఫిబ్రవరిలో శతకోటీశ్వరుడు రిచర్డ్ బ్రాన్సన్ నిర్వహించిన సంగీతకచేరీ కార్యక్రమం ద్వారా సేకరించిన లక్షల కోట్ల డాలర్లనిధులను గైడో,ఆయన అనుచరులు తమ కుట్రలకు సహకరించిన కొందరు సైనికాధికారులకు నజరానాగా ఇచ్చారని కొలంబియా నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనితో పాటు మదురో సర్కారును గద్దెదించే కుట్రలకోసం అమెరికా తమకు అందించే 'సాయాన్ని' అందుకునేందుకు కొలంబియా-అమెరికా సరిహద్దులను తెరవాలని గైడో అనుచరులు కొలంబియా సర్కారును వత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన మదురో సర్కారును కూల్చివేసి తాము గద్దెనెక్కేందుకు గైడో, ఆయన అనుచరులు ఈ సొమ్మును తస్కరించారని కొలంబియా నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి లీకయిన పత్రాలను గైడో అనుకూల పత్రిక పాన్ అమ్పోస్ట్ ప్రచురిం చటం విశేషం. వెనిజులా ప్రజలకోసం సేకరించిన సహాయ నిధులను గైడో, ఆయన అనుచరులు విలాసాలకు వెచ్చించారని ఈ పత్రాల ద్వారా తెలు స్తోంది. ఈ పత్రాల లీకేజితో గుట్టు రట్టవడంతో అప్రమత్తమైన గైడో నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన ఈ ఆరోపణలు వాస్తవమేనని అంగీకరించారు.
వెనిజులా ప్రజలకు అందాల్సిన సాయాన్ని దారి మళ్లించిన విపక్షం
