- అంగీకరించిన ద.కొరియా
సియోల్: కొరియన్ ద్వీపకల్పంలో అమెరికా సేనల నిర్వహణకు మరింత మొత్తం చెల్లించాలన్న ట్రంప్ డిమాండ్‌కు దక్షిణ కొరియా తలొగ్గింది. ఈ అంశంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి స్వస్తి పలుకుతూ ఇరు దేశాల నేతలు ఆదివారం ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. కొరియా యుద్ధం (1950-53) శాంతి ఒప్పందం ద్వారా కాకుండా యుద్ధ విరమణ ద్వారా ముగింపు పలికినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య భద్రతా పొత్తు కొనసాగుతూ వస్తోంది. ద.కొరియాలో ప్రస్తుతం 28,500 మంది అమెరికన్ సైనికులు తిష్టవేసుక్కూర్చొన్నారు. ఉత్తర కొరియాను బూచిగా చూపి అమెరికా తన సేనలను ద.కొరియాలో కొనసాగిస్తున్నది. ఇందుకయ్యే వ్యయాన్ని అమెరికా, ద. కొరియాలు పంచుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా వాటాను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇరు దేశాలు అనేక దఫాలుగా చర్చించి చివరికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలపై వార్షిక పద్దు కింద దక్షిణ కొరియా 1,03,000 కోట్ల వాన్లను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది 96,000 కోట్ల వాన్‌లుగా ఉన్నది. అంటే 8.2 శాతం పెరిగిందన్నమాట. ఇక్కడి అమెరికన్ బలగాలకయ్యే మొత్తం వ్యయంలో దక్షిణ కొరియా 40శాతం దాకా భరిస్తున్నది. గతంలో ఐదు సంవత్సరాల కాలపరిమితితో కుదుర్చుకున్న ఒప్పందాలకు భిన్నంగా కొత్త ఒప్పందం గడువును మూడేళ్లకు పరిమితం చేశారు. అమెరికాపై ఆధారపడే బదులు ఉత్తర కొరియాతో దక్షిణ కొరియా మైత్రీ సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకుంటే ఏటా లక్ష కోట్ల డాలర్లు ఆదా అవుతుంది.
అమెరికా సేనలకు అధిక మూల్యం
