- డబ్ల్యుటివో పై ధ్వజం
- భారత్, చైనాలకు రాయితీలపై విసుర్లు
చికాగో : చైనా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. చైనా ఈ స్థితికి చేరుకోవడానికి డబ్ల్యుటిఓనే అనుమతించిందని ఆయన రుసరుసలాడారు. నార్త్్ డకొటా నగరంలో నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, తాము భారత్, చైనా వంటి కొన్ని దేశాలను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా పరిగణించి వాటికి రాయితీలు ఇస్తున్నామని, వీటిలో కొన్ని ఇప్పటికీ తగినంత పరిణతి సాధించలేదు. వాటికి రాయితీలు ఇస్తున్నాము. కానీ, భారత్, చైనా లాంటి ఆర్థిక వ్యవస్థలకు రాయితీలను నిలిపేయాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని, అందువల్ల ఇతర దేశాల కన్నా చాలా వేగంగా అమెరికా ఎదగాలని తాను కోరుకుంటున్నానని చెప్పారుఈ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తున్నామని, మరికొన్ని దేశాలు ఇంకా పూర్తి స్థాయిలో ఎదగలేదని, వాటికి సబ్సిడీలు చెల్లిస్తామని తెలిపారు. భారత్, చైనాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా తమకు తాము చెప్పుకుంటున్నాయని, అందువల్లే ఆ కేటగిరీలో వాటికి సబ్సిడీలు లభిస్తున్నాయని అన్నారు. మేం వారికి డబ్బు చెల్లించడం అంటేనే అర్ధరహితంగా వుందన్నారు. అందువల్లే దాన్ని నిలిపివేయాలని భావిస్తున్నామని చెప్పారు. అన్నిటికంటే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) అత్యంత అధ్వాన్నమైనదని తాను భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. కానీ చాలా మందికి అసలు అదేంటో తెలియదు. చైనాను గొప్ప ఆర్థిక శక్తిగా మారడానికి అనుమతించింది డబ్ల్యుటిఓనే అని విమర్శించారు. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య లోటుపై మాట్లాడుతూ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్కుి తాను పెద్ద అభిమానినని, అయినా మనం న్యాయంగా వుండాలని ఆయనకు చెప్పానని అన్నారు. అమెరికా నుండి 50వేల కోట్ల అమెరికా డాలర్లను తీసుకెళ్ళి తన దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి మేం ఎంత మాత్రమూ అనుమతించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక్కడ నుండి తీసుకెళ్ళిన దాంతో వారి దేశాన్ని పునర్నిర్మించుకోవడం మంచిదే కానీ దానికి వారు అమెరికాకు కొంత డబ్బు చెల్లించాల్సి వుంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొందని అన్నారు. ''ఏళ్ళ తరబడి ఈ దేశాలన్నింటినీ మేం కాపాడుతూ వస్తున్నాం, కానీ వారు లాభాలు గడిస్తున్నారు. వారికి సైనిక వ్యయం పెద్దగా వుండడం లేదు. మాకు చాలా ఖర్చవుతోంది. బయటి దేశాలను పరిరక్షించేందుకే ఇందులో ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సివస్తోందని, కానీ ఆ దేశాల్లో కొన్ని కనీసం మమ్మల్ని ఇష్టపడడం లేదు.'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 'మేం రక్షణ కల్పిస్తున్న దేశాలు సంపన్న దేశాలుగా మారుతున్నపుడు అవి మాకు కొంత చెల్లించాల్సిందే, మా పట్ల వాటికి ఇప్పుడు గౌరవం వుండొచ్చు, కానీ దానికన్నా ముందు డబ్బు చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు.
చైనా ఎదుగదలపై ట్రంప్ అసహనం
