- పిటిఐ అభ్యర్థికే విజయావకాశాలంటున్న పరిశీలకులు
ఇస్లామాబాద్: మంగళవారం జరుగనున్న పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార పిటిఐ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పిటిఐతో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థులు బరిలో వున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పదవీ కాలం ఈ నెల 8వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మరోసారి పోటీ చేసేందుకు విముఖత చూపటంతో ఇతర పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇందులో పిటిఐ తరపున పోటీ చేస్తున్న ఆరిఫ్ అల్వి ఇప్పటికే ప్రచారంలో ముందంజలో వున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటి పోలింగ్లో ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే పిపిపి నాయకత్వం తన అభ్యర్థిని పోటీ నుండి ఉపసంహరించుకుంటే ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి ఒక్కరే రంగంలో మిగులుతారని, అప్పుడు గట్టి పోటీ ఎదురౌతుందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాలలో సోమవారం వరకూ ఏకాభిప్రాయం రాకపోవటంతో పిపిపి నేతలు, పిఎంఎల్ అధినేత నవాజ్షరీఫ్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
బలాబలాలు...
ఈ ముక్కోణపు పోటీలో ప్రయోజనం పొందగలిగేది పిటిఐ మాత్రమేనని భావిస్తున్నారు. మొత్తం 706 మంది సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజిలో పిటిఐకి సొంతంగా 251 మంది సభ్యులు బలం వుండగా మిత్రపక్షాల బలంతో కలుపుకుని ఈ పార్టీ బలం 314కు పెరుగుతుంది. పిఎంఎల్, పిపిపి ఉమ్మడి బలం 260 వుండగా చిన్నా, చితకా పార్టీల బలం కలుపుకుని ఇది 321కి చేరుతుంది. దీనితో పిఎంఎల్-పిపిపి మధ్య ఏకాభిప్రాయ సాధనపైనే ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఆధారపడి వుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.