- జనానికి దూరంగా కళావేదికల ఏర్పాటు
- ఖాళీ కుర్చీలతో కళాకారులు దిగాలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పుష్కరాలకు రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం జనాల మనుసులను తట్టిలేపే సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం లేకుండా చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒక్కటేనని తెలుస్తోంది. ఘాట్లకు సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే రాత్రిపూట చేరుకునే యాత్రికులంతా వాటిని తిలకించే అవకాశం ఉంటుంది. జనంరాకతో కళాకారులు మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అయితే కొవ్వూరులో ఆ పరిస్థితి లేకుండా పోయింది. నాలుగైదు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఒక్కరూ కూడా ఉండటం లేదు. తొలిరోజు కళాకారులు కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ప్రయత్నించినా జనం లేకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. తర్వాత నుంచి కార్యక్రమాలు కూడా జరగడం లేదు. రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మిగిలినచోట్ల కూడా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. దీంతో పుష్కరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి లేకుండా పోయాయి. అధికారులు మాత్రం తేదీలవారీగా కార్యక్రమాల జాబితాను మాత్రం విడుదల చేసేశారు. అయితే ఎక్కడా ఎటువంటి కార్యక్రమాలు జరగకపోయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. యాత్రికులకు అందుబాటులో లేనివిధంగా ఈ వేదికలు ఏర్పాటు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. గోష్పాద క్షేత్రం వంటి ఘాట్ వద్ద కావాల్సినంతా స్థలం ఉంది. దూర ప్రాంతాల నుంచి చేరుకునే యాత్రికులు రాత్రిపూట అక్కడే కాసేపు విశ్రమిస్తున్నారు. అలాంటి వారికి ఎటువంటి కాలక్షేపమూ లేకుండా పోయింది. అలాంటి చోట ఏర్పాటు చేస్తే యాత్రికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాల ప్రయోజనం అందరికీ అర్థమయ్యే అవకాశం ఉండేది. అంతేకాకుండా మరికొన్ని ఘాట్లకు దగ్గరగా ఉన్న స్థలాలను ఎంపిక చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చేవి. అయితే ఎంతో ఖర్చు పెటినట్లు చెబుతున్నా ఎటువంటి ఫలితమూ లేకుండా పోయింది. ఇదంతా అధికారులు ముందస్తుగా ఊహించలేదా.. అంటే ఆశ్చర్యపోక తప్పదు. సాంస్కృతిక కార్యక్రమాలపై సరైన శ్రద్ధ చూపకపోవడమే దీనికి కారణమని చెప్పొచ్చు. పుష్కరాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వం కళారంగానికి ప్రోత్సాహం ఇవ్వకపోవడం కళాభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. పుష్కరాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు లేని లోటు కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మేల్కొని యాత్రికులకు అందుబాటులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిది. మిగిలిన రోజుల్లోనైనా కళారంగాన్ని ప్రోత్సహించిన వారవుతారు.
పుష్కరాల్లో కశలకు ప్రోత్సాహమేది..!
