అడ్డుకున్న గిరిజనులపై దాడి
జగన్నాధపురంలో రంగరాజు మనుషుల దాష్టీకం
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మండలంలోని జగన్నాధపురం మామిడితోట శుక్రవారం నెత్తురోడింది. రంగరాజు మనుషులు గిరిజనులపై దాడి చేసి మామిడి పంటను తరలించారు. తమపై దాడి చేసి అక్రమంగా పంట తరలించుకుపోయిన రంగరాజు అనుచరులు సరిపల్లి సత్యనారాయణరాజు, పాలడుగుల నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళలు సోడెం ముత్యాలమ్మ, సోడెం చిలకమ్మ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగన్నాధపురం గ్రామంలోని 76.68 ఎకరాల 1/70 చట్టం పరిధిలోకి వచ్చే మామిడితోటను స్వాదీనం చేసుకుని అంకన్నగూడెం పంచాయతీ పరిధిలోని జగన్నాధపురం, దిబ్బగూడెం గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. భూమిపై ఎటువంటి హక్కూ లేని చెరుకువాడ శ్రీరంగనాధరాజు (రంగరాజు) జగన్నాధపురంలోని తోట నుంచి పంటను ప్రతియేటా అధికారుల అండతో కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చి తరలించడం సర్వసాధారణమైంది. ఈ ఏడాది ఆ ఎత్తుగడలేవీ ఫలించకపోవడంతో రంగరాజు కిరాయి గూండాలను రంగంలోకి దింపు తమపై కత్తులతో దాడి చేయించారని గిరిజనులు వాపోతున్నారు. మామిడి పంటను ఎందుకు కోస్తున్నారని ప్రశ్నించిన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో సోడెం ముత్యాలమ్మపై కిరాయిగూండాలు గీత కత్తితో దాడి చేయడంతో కుడిచేతిపై బలమైన గాయమైంది. సోడెం చిలకమ్మ మరికొంత మంది గిరిజన మహిళలపై దాడి చేసి దుస్తులు చింపి అవమానించారు. దీనిపై జిల్లా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గిరిజనులపై దాడి చేయించిన రంగరాజుపై, ఆయన అనుచరులు సరిపల్లి సత్యనారాయణరాజు, పాలడుగుల నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, మామిడి పంటను తమకు అప్పగించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
గిరిజనులపై దాడి దుర్మార్గం : సిపిఎం
జగన్నాధపురంలో చెరుకువాడ రంగరాజు గూండాలతో గిరిజనులపై దాడి చేయించడం దారుణమని, దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. దాడిలో గాయపడిన గిరిజనులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే జీలుగుమిల్లి ఎస్ఐ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. గిరిజనులను భూమిపై మీకున్న హక్కులేమిటో చూపించాలనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, నాయకులు గుడెల్లి వెంకట్రావు, గుండు గంగరాజు, వాడే పాపారావు ఒక ప్రకటన విడుదల చేశారు.