పాడేరు ఐటిడిఎ పిఒ బాలాజీ
మండలంలో విస్తృత పర్యటన
లుబ్బూరు పిహెచ్సి ఆకస్మిక తనిఖీ
ఆస్పత్రి ప్రసవాలపై ఆరా
ప్రజాశక్తి- ముంచంగిపుట్టు
ఏజెన్సీలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వపరంగా ఐటిడిఎ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఐటిడిఎ పిఒ డికె.బాలాజీ అన్నారు. సోమవారం మండలంలో విస్తృత పర్యటన చేశారు. సుజనకోట పంచాయతీ వనుగుపుట్టు గ్రామాన్ని సందర్శించి, గుళ్ల రాగి పంట సాగును పరిశీలించారు. గ్రామంలో ఎంతమంది గిరిజన రైతులు గుళ్ల రాగి పంటలను పండిస్తున్నారనే దానిపై ఆరా తీశారు. 29 మంది రైతులు ఒక్కో ఎకరం చొప్పున సాగుచేస్తున్నట్లు స్థానికులు పిఒకు వివరించారు. ఈ సందర్భంగా రాగి పంట కోతను పిఒ స్వయంగా కొడవలితో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడి లేని ప్రకృతి విధానంలో సాగు వల్ల మంచి దిగుబడులు, ఆదాయంతో గిరిజనులు ఆర్థికాభివృధ్ది చెందాలని ఆకాంక్షించారు. వనుగుపుట్టు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. ప్రకృతి విధానంలో సాగుకు ఐటిడిఎ ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. నీడ తోటలు, చేపల వేటకు పడవలు, వలలు అందించాలని వనుగుపుట్టు గ్రామస్తులు పిఒను కోరగా సానుకూలంగా స్పందించారు. ఏనుగురాయి పంచాయతీ గద్దెలబురుగు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. సొంత భవనం లేక అద్దె భవనంలో పాఠశాల నిర్వహణకు పడుతున్న కష్టాలను వివరించి, సొంత భవానాన్ని సమకూర్చాలని స్థానికులు కోరగా, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి త్వరలోనే భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. లుబ్బూరు పిహెచ్‌సిని ఆకస్మికంగాసందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వైద్యులు,సిబ్బంది నిత్యం రోగులకు అందుబాటులోఉండి సేవలు అందించాలని, గైర్హాజరైనా, విధుల్లో నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రిలో ప్రసవాలు, గర్భిణులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సంజీవిని సంస్థ డైరెక్టర్ దేవుళ్లు, అమ్మాజీ పాల్గొన్నారు
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
