ప్రజాశక్తి - కంచిలి
పర్యావరణం పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాకు చెందిన బిటెక్ విద్యార్థి జె.ఇమ్మాన్యుయేల్ జోసెఫ్రాజ్ కాలినడక చేపట్టాడు. శుక్రవారం కంచిలి చేరుకున్న విద్యార్థిని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చింతాడ శరత్‌బాబు ఆహ్వానం పలికి, విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ రాజ్ మాట్లాడుతూ తాను పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం కన్యాకుమారి నుంచి ద్వారక వరకు కాలి నడక చేపడుతున్నానన్నారు. దారిలో కలిసే ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేస్తున్నానని తెలిపారు. సముద్రంలోని మొక్కలు మనకు 75 శాతం ఆక్సిజన్ అందిస్తున్నాయని, మనం కాలువల్లో విడిచిపెట్టే వ్యర్థాలు, కాలువుల, నదుల ద్వారా వెళ్లి, సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని చెప్పారు. దీనిపై విద్యార్థులు స్పందించాలన్నారు. అధ్యాపకులు నాగరాజు, సాంబమూర్తి విద్యార్థిని అభినందించారు.