- ఆల్ యూనివర్శిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి నాగేశ్వరరావు
ప్రజాశక్తి - మద్దిలపాలెం
కార్మిక హక్కుల సాధనకు సెప్టెంబర్ 2న సమ్మె చేస్తున్నామని ఆల్ యూనివర్శిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఎయు కామర్స్ హాల్లో ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎన్ఎంఆర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా కార్మిక హక్కులను కాలరాసే చట్టాలను తీసుకువస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధనకు సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా అఖిల పక్ష కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. సమ్మెలో 50 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమ్మెలో ఎయు ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, కార్మికులకు రూ.15వేలు కనీస వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తదితర 12 డిమాండ్లతో సమ్మె చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయు హాస్టల్ ఉద్యోగులను తక్కువ వేతనాలతో ఏళ్ల తరబడి ఊడిగం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నగర కార్యదర్శి ఆర్కెఎస్వి కుమార్ మాట్లాడుతూ, ఎయులో 10 డిమాండ్లతో కూడిన స్థానిక సమస్యలతో కూడిన బ్యానర్లతో రిజిష్టర్ ఆఫీస్ గేటు ముందు సెప్టెంబర్ 2న సమ్మె జరపాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 సమ్మెతో భవిష్యత్తులో ఎయు కార్మికుల పోరాటాలకు నాంది పలకాలన్నారు. తరువాత ఎయు కార్మికుల సమస్యలు సాధనకు చేయవలసిన కార్యాచరణ గురించి చర్చిస్తామన్నారు. ఎయు ఆల్ యూనివర్శిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సిహెచ్ఎన్వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగి ఈ కార్యక్రమంలో హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై.కృష్ణ, ఎయు ఎన్ఎంఆర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం.అప్పలరాజు, ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల సాధనకు సెప్టెంబర్ 2 సమ్మె
