- తాగునీటి సౌకర్యం లేక గ్రామస్తుల అవస్థలు
- అస్తవ్యస్తంగా డ్రెయినేజి
ప్రజాశక్తి-కొత్తకోట
రావికమతం మండలం మర్రివలస గ్రామం గత కొన్నేళ్లుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ గ్రామంలో నేటికి తాగునీటి రక్షిత పథకం లేదంటే గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఏర్పడి సుమారు 40 ఏళ్లు దాటినా నేటికీ మౌలిక సదుపాయాలు లేవు. 25 ఏళ్లు క్రితం నిర్మించిన 10వేల సామర్థ్యం గల రక్షిత నీటి పథకం 5 ఏళ్ల క్రితం శిథిలావస్థకు చేరింది. దీంతో, గ్రామస్తులు తాగునీటికి చేతి బోర్లపైనే ఆధారపడుతున్నారు.
గొళ్లలపాలెంలో మౌలిక సౌకర్యాలు కరువు
ఈ గ్రామానికి శివారుగా ఉన్న గొళ్లలపాలానికి నేటికీ రహదారి సౌకర్యం లేదు. దీంతో, గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ గ్రామానకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడాల్సిందే. ఈ గ్రామాల్లో సుమారు 2,500 జనాభా ఉండగా 8 వార్డుల్లో 900 ఓటర్లు ఉన్నారు.
అస్తవ్యస్తంగా డ్రెయినేజి
మర్రివలస గ్రామంలోని ప్రధాన వీధిలో డ్రెయినేజి లేకపోవడంతో మురుగు నీరు రహదారిపైకి చేరుతోంది. అలాగే దుర్గందం వెలువడుతుండటంతో ఆ మార్గం గుండా వెళ్లేవారు ముక్కున వేలేసుకొని వెళుతున్నారు. గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేదు. ఎక్కడ చూసిన మురుగునీటి గుంతలు దర్శనం ఇస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే గ్రామానికి సుస్తి చేసినట్లే. ఈ కాలంలో గ్రామస్తులు డయేరియా, వైరల్ జ్వరాల బారిన పడుతుంటారు. వీటి నివారణకు నెలల తరబడి వైద్య శిబిరాలు నిర్వహించాల్సిందే. రక్షిత తాగునీటి పథకం పూర్తిగా శిథిóలావస్థకు చేరడంతో గ్రామానికి సమీపంలో నేల బోరు నుంచి తాగు నీటిని అరకొరగా అందిస్తున్నారు. అది కాస్త మరమ్మతుకు గురైతే తాగు నీరు అందని పరిస్థితి నెలకొంటుంది. దీంతో, చేతి బోర్లపైనే ఆధార పడుతున్నామని గ్రామస్తులు అమ్మిరెడ్డి రాజు, ఎలిశెట్టి సత్తిబాబు, నక్కా సత్తిబాబు, తదితర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో చేతి బోర్ల నుంచి ఆకు పచ్చని రంగులో కలుషిత తాగు నీరు వస్తుందని వారు వాపోయారు. ఈ నీటిని తాగడానికి ఇబ్బంది పడుతున్నామన్నారు.
గ్రామంలో మురుగు నీటి కాలువులు నిర్మాణానికి, రక్షిత మంచినీటి పథకంకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో వైర్లు వేెలాడుతున్నాయని, వీటిని సరిచేయాలని కోరుతున్నారు. పాఠశాలకు అదనపు భవణం, ప్రహారి గోడ, అంగన్వాడీ భవణ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అధికార్లు చోరవ చుపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నిధుల మంజూరుకు ప్రతిపాదనలు
రక్షిత తాగునీటి పథకం మంజూరుకు ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. డ్రెయినేజి వ్యవస్థ నిర్మాణానికి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. గొల్లలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పనకు నిధుల మంజూరుకు ఎమ్మెల్యే, ఎంపీలకు విన్నవించాం.
- సత్యవతి, సర్పంచ్
చేపట్టాల్సిన పనులు :-
1.గ్రామంలో రక్షిత తాగునీటి పథకం నిర్మించాలి.
2.మురుగు కాలువుల నిర్మాణం చేపట్టాలి.
3.సిసి రోడ్లు నిర్మించాలి.
4.గొల్లలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి
5.పాఠశాలకు అదనపు భవనం , ప్రహారి గోడ నిర్మాంచాలి
6.అంగన్వాడీకేంద్రానికి సొంత భవనం మంజూరు చేయాలి.