ప్రజాశక్తి-సీతమ్మధార
వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం తాటిచెట్లపాలెం నుంచి 80 అడుగుల రోడ్డు, మహారాణి పార్లర్, జగ్గారావు బ్రిడ్జి, అక్కయ్యపాలెం, దొండపర్తి, ఆర్టిసి కాంప్లెక్స్ సిరిపురం మీదుగా పాదయాత్ర కొనసాగింది. యాత్రలో ప్రజలు అనేక సమస్యలు జగన్‌కు వివరించారు. రోడ్డంతా వైసిపి కార్యకర్తలతో నిండిపోయింది. సన్నాయి, డప్పుల దరువు, పాటలు జనాలను హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో వైసిపి ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జి కెకె.రాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజరుకుమార్, మళ్ల విజయప్రసాద్, ఎంవివి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వినతి
విశాఖపట్నం : తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం సంకల్పయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తూ సంగం, శరత్ థియేటర్ వద్దకు వచ్చేసరికి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ జెఎసి నాయకులు ఆయన్ను కలిసి తమ సమస్యను వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం చెల్లించాలని, 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని, ఐఆర్ ఇవ్వాలని, 180రోజులు వేతనంతో కూడిన ప్రసూతి శెలవులు మంజూరుపై జగన్ స్పష్టమైన ప్రకటనచేయాలని కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టైంస్కేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎస్.ఇందీవర, పి.మణి, కనకల ఈశ్వర్, మోహన్, సోమేశ్వరి, సత్యనారాయణ, శేషుకుమార్, సుధాకర్, రాధాబెహర తదితరులు పాల్గొన్నారు.
లక్ష ఉద్యోగాలు ప్రకటించాలని నిరుద్యోగ జెఎసి వినతి
ఆంధ్రప్రదేశ్‌లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని కోరుతూ ఎపి నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యాన జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలచేయాలని, ఎపిపిఎస్సి పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, పోటీ పరీక్షల సిలబస్‌ను, పరీక్షా విధానాన్ని మార్చొద్దని కోరారు.
కిరోసిన్ హాకర్ సంఘం వినతి
విశాఖపట్నం : కిరోసిన్ అమ్మకమే జీవనాధారంగా బతుకుతున్న తమకు 2017 నుంచి సరఫరా నిలిపేసి ఈ ప్రభుత్వం రోడ్డుపాల్జేసిందని, తమను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ శాఖలలో వేటిలోనైనా నియమించాలని కోరుతూ విశాఖ నగర కిరోసిన్ హాకర్స్ సంఘం అధ్యక్షులు గొంటు మోహనరావు సోమవారం వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కిరోసిన్ సరఫరా నిలిపేయడంతో 676 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వివరించారు. 35 సంవత్సరాలుగా దీనిపైనే ఆధారపడ్డామని, వారసత్వపు లైసెన్స్‌లు ఉండటం వల్ల తమ పిల్లలు కూడా కిరోసిన్ అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా సరఫరా నిలిపేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ బతుకు తెరువు కోసం ప్రభుత్వ శాఖలలో నియమించి జీవన భతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి గంగామహేశ్, డి.శ్రీను, కాయల శ్రీనివాస్, కాయల రామారావు, బాధ శ్రీనివాస్, సురబత్తుల తిరుపతి, బాధ గోవింద్, పి.కన్నాపడు, హాకర్స్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జగన్ పాదయాత్రలో వినతుల వెల్లువ
