గొల్లప్రోలు : వైసిపి ప్రభుత్వం రైతు పక్షపాతి అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చేబ్రోలు గ్రామంలో కోస్తా ఆంధ్ర జోన్ పరిధిలో తొలిసారిగా సెంటర్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టుగూళ్ల నుంచి దారం తీసే ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం పట్టు రీలర్లు, పట్టు రైతుల సమ్మేళనం నిర్వహించారు. పిఠాపురం ఎంఎల్ఎ పెండెం దొరబాబు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుం దన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇప్పటికే చెల్లించిందన్నారు. రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాల కోసం కేటాయించిందన్నారు. గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ పక్కదారి పట్టిందని విమర్శించారు. మల్బరీ తోటల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆంధ్రాలో పట్టు పరిశ్రమకు సంబంధించి రీలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. వాస్తవంగా ఇలాంటి యూనిట్లు చిత్తూరు, అనంతపూర్ జిల్లాలో మాత్రమే ఉన్నాయి. పట్టు గూళ్లను నిల్వ చేసుకునేందుకు గొడౌన్లు, అదనపు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి చర్యలు చేపడతామన్నారు. ప్రతి రైతుకు నాలుగేళ్లలో రూ.50 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఆటోమేటిక్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన పట్టు రైతు ఉలవకాయల సత్తిరాజును అభినందించారు. ఎంఎల్ఎ పెండెం దొరబాబు మాట్లాడుతూ కోస్తాంధ్ర 7 జిల్లాల్లో పట్టు రైతులకు ఈ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సెంట్రల్ సిల్క్ బోర్డు డైరెక్టర్లు, పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ పట్టు పరిశ్రమపై, పట్టు పురుగుల పెంపకం, వాటి ఉత్పత్తులు నాణ్యతపై వివరించారు. ఏడు జిల్లాలకు చెందిన పట్టు రైతులకు ఈ యూనిట్ ఒక పెద్ద కేంద్రంగా ఉపయోగపడుతుందన్నారు. యూనిట్ ద్వారా చాలా మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారులు, చేబ్రోలు పట్టుపరిశ్రమ కేంద్రం అధికారులు, పిఠాపురం డివిజన్ వ్యవసాయ, రెవిన్యూ, మండల పరిషత్ అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం రైతు పక్షపాతి మంత్రి కన్నబాబు
