గుణదల ఉత్సవాలకు పోటెత్తిన యాత్రికులు ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
గుణదల మాత ఉత్సవాలు రెండవ రోజు ఆదివారం కావడంతో యాత్రికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు రావడంతో గుణదల కొండ కిక్కిరిసిపోయింది. రెండవరోజు ఉత్సవాలను ఆదివారం ఉదయం గుంటూరు కతోలిక పీఠం బిషప్ మోస్ట్ రెవరెంట్ చిన్నాబత్తిన భాగయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మరియమాత ప్రజలను కాపాడుతుందని ప్రతి ఒక్కరూ శాంతి, దయతో ఉండాలని పేర్కొన్నారు. పేదల పట్ల ప్రతి ఒక ్కరూప్రేమను చూపాలన్నారు. ఆపదలో ఉన్న వారిని మనకు తోచిన విధంగా ఆదుకోవాలని అన్నారు. బైబిల్ గ్రంథం మనవంతా ఒక్కటేనని చెపుతుందని అందుకే ప్రతి ఒక్కరూ ప్రేమ, దయ , జాలి, కరుణ కలిగి ఉండాలని పేర్కొన్నారు. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు మాట్లాడుతూ ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చారని వారందరికీ ఎటువంటి
ఇబ్బందులు లేకుండా ఉత్సవ కమిటీ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఉత్సవ కమిటీ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సోషల్ సర్వీస్ సె ంటర్ డైరెక్టర్ పసల తోమస్, ఫాదర్లు జాన్టివ్, ఎన్.డేవిడ్రాజు, కొండ్రు సింహరాయులు తదితర గురువులు రెండవరోజు సమిష్టి దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గురువులు కతోలిక యాత్రికులకు దివ్యసత్ప్రసాదాన్ని అందచేశారు.
రెండోరోజు సమిష్టి దివ్య పూజాబలి సమర్ఫణ...
రెండవరోజు ఆదివారం సాయంత్రం ఉత్సవాలలో భాగంగా ఏలూరు కతోలికపీఠం బిషప్ పొలిమెర జయరావు, విజయవాడ కతోలిక పీఠం బిషప్ రాజారావు, పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ పసల తోమస్ తదితర గురువులు సమిష్టి దివ్య పూజాబలి సమర్పించారు. లక్షలాదిగా తరలివచ్చిన యాత్రికులు కొండపై బారులు తీరి గుణదల మాతను, కొండ శిఖరాన ఏసుక్రీస్తు శిలువను దర్శించి మొక్కలు తీసుకున్నారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలు...
రెండవరోజు ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకట్టుకున్నాయి.జి.బాలస్వామి ఆధ్వర్యంలో గుణదల విచారణ గాయక బృందం ఆలపించిన పూజాగతాలు, నూజివీడు గురు విద్యాలయం బృందం ప్రదర్శించిన కోలాటం, కార్మెల్ నగర్ విజయమేరి అంథ బాల బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, విజయవాడ మేత్రాసన ప్రేరణ యూత్ సెంటర్ యువతీ యువకులు ప్రదర్శించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. పాస్టరల్ సెంటర్ ఫాదర్ దామాల విజయకుమార్ నిర్వహణలో బృందం ఆలపించిన పూజాగీతాలు మంత్రముగ్దుథలను చేశాయి.
గుణదల ఉత్సవాలకు పోటెత్తిన యాత్రికులు
