రోడ్డుకు 'సుందరయ్య' పేరు
ఖరారు
ప్రజాశక్తి - విజయవాడ
నగరంలోని 52వ డివిజన్ ఎన్టిఆర్ నగర్ (న్యూ రాజరాజేశ్వరీపేట) ఉత్తరం వైపు ప్లాట్ నెంబర్ 51 నుంచి దక్షిణం వైపు ప్లాట్ నెంబర్ 1147 వరకు ఉన్న రోడ్డుకు కమ్యూనిస్టు ఉద్యమ నేత ''పుచ్చలపల్లి సుందరయ్య'' రోడ్డుగా నామకరణానికి నగరపాలక సంస్థ క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ ఆమోదిస్తూ కౌన్సిల్ వారి ముందుంచాలని సమావేశం తీర్మానించింది. క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ చైర్మన్ చెన్నుపాటి గాంధీ అధ్యక్షత సమావేశం శనివారం జరిగింది. కమిటీ వైస్ చైర్మన్, టిడిపి ప్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు, సభ్యులు యోదుపాటి రామయ్య, పిన్నంరాజు త్రిమూర్తిరాజు, ఇతర సభ్యులు, టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారి (సిపి) ఎ.లక్ష్మణరావు, క్రీడల అధికారి శ్రీధర్, సెక్రటరీ చంద్రయ్య తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, నిర్ణయం చేశారు. రోడ్లకు నామకరణం చేయాలనే అంశాలు ఈ సారి అజెండాలోకి ఎక్కువుగా వచ్చాయి. ఆయా పార్టీల నేతలు, డివిజన్లలో కొద్దో గొప్పొ పేరున్న వ్యక్తులు, కార్పొరేటర్ల అనుయాయులకు సంబంధించిన వారి పేర్లు ఆయా డివిజన్లలోని రహదారులకు నామకరణం చేయాలని క్రీడలు, ట్రాఫిక్ కమిటీ సమావేశంలో నిర్ణయం జరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి రోడ్లకు పేరు పెట్టే ప్రతిపాదనలు అత్యధికంగా రావడం జరిగింది. వీటిల్లో కొన్ని ఆమోదించడం, మరికొన్నింటిని తిరస్కరించడం జరిగింది. ఈ సమావేశంలో ఆమోదించిన అంశాలను కౌన్సిల్ ముందు ఉంచాలని తీర్మానించారు. 52వడివిజన్లోని ఉత్తరం వైపు ప్లాట్ నెంబర్ 51 నుంచి దక్షిణం వైపు ప్లాట్ నెంబర్ 1147 వరకు గల రోడ్డుకు పుచ్చలపల్లి సుందరయ్య రోడ్డుగా నామకరణం చేయాలని డివిజన్ కార్పొరేటర్ ఎరుబోతు శ్రావణి పెట్టిన ప్రతిపాదనను సమావేశంలో ఆమోదిస్తూనే కౌన్సిల్ సమావేశం ముందుంచాలని తీర్మానించింది. ఇదే డివిజన్లోని ఉత్తరం వైపు ప్లాట్ నెంబర్ 1604 నుంచి దక్షిణం వైపు ప్లాట్ నెంబర్ 1255 వరకు గల రోడ్డుకు సిపిఐ నాయకులు చండ్ర రాజేశ్వరరావు రోడ్డుగా నామకరణం చేయాలని కార్పొరేటర్ శ్రావణి పెట్టిన ప్రతిపాదనను సమావేశం ఆమోదిస్తూ కౌన్సిల్ వారి ముందుంచాలని తీర్మానించింది. 16వ డివిజన్లో ఎస్సి, ఎస్టి నిధులతో నిర్మాణం జరుగుతున్న కమ్యూనిటీ హాలుకు డాక్టర్ బిఆర్ ఆంబేద్కర్ పేరును నామకరణం చేయాలని స్థానిక కార్పొరేటర్ మద్దా శివశంకర్ తీసుకొచ్చిన ప్రతిపాదనను సమావేశం తిరస్కరించింది. 12వ డివిజన్ చిన్న రామాలయం దగ్గర ఉన్న డోర్ నెంబర్ 62-2-19 నుంచి 62-2-1 వరకు ఉన్న వీధికి '' భావ కవి పొనమాల కోటేశ్వరరావు పేరు పెట్టడానికి అవకాశం ఇవ్వాలని స్థానిక కార్పొరేటర్ కె.రమాదేవి పెట్టిన ప్రతిపాదనపై ఈ వీధికి ఇప్పటికే పేరు ఉన్నందున తిరస్కరిస్తున్నట్లు సమావేశం నిర్ణయించింది. ఇదే డివిజన్లోని కృష్ణవేణి స్కూల్ రోడ్డులోని పూజిత అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సర్కిల్ వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ పెట్టిన ప్రతిపాదన తిరస్కరించబడింది. 9వ డివిజన్లోని తంగెళ్లమూ డి వారి వీధికి తూర్పు వైపున గల రోడ్డుకు కాలనీ కార్యదర్శిగా, కాలనీ అభివృద్ధికి విశేష కృషి చేసిన వల్లూరు సాంబ శివరావు పేరున ఆరోడ్డుకు నామకరణం చేయాలని మేయర్ శ్రీధర్ సిఫారస్సు మేరకు కోఆప్షన్ మెంబర్ సిద్దెం నాగేంద్రరెడ్డి పెట్టిన ప్రతిపాదనను సమావేశం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. 28వ డివిజన్లోని కపర్థి సర్వీసు స్టేషన్ పక్క రోడ్డుకు కాసుల గురివిశెట్టి రోడ్డుగా పేరు పెట్టాలని కమిటీ వైస్ చైర్మన్, టిడిపి ప్లోర్‌లీడర్ హరిబాబు పెట్టిన ప్రతిపాదనను సమావేశం తిరస్కరించింది.
రోడ్డుకు 'సుందరయ్య' పేరు ఖరారు
.jpg)