సంక్రాంతి సంబరాలు ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
భోగిపళ్లు... పిండివంటలు... భోగి మంటలు...రంగు రంగుల ముగ్గులు...చెరుకు గడలతో ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం కళాశాల ఆవరణలో కళాశాల విద్యార్థినీ, విద్యార్థుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాలను రంగు రంగుల కాగితాలతోనూ... మామిడి తోరణాలు, చెరుకు గళ్ళతో అందంగా అలంకరించారు. కళాశాల విద్యార్థినులు సంప్రదాయ పద్దంగా పట్టు వస్త్రాలు ధరించి పండుగ వాతావారణాన్ని తలపింపచేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈపండుగ విశిష్టతను తెలియచేసే విధంగా వరి కుప్పలు పోయడం, ఎడ్ల బండ్లు..బొమ్మల కొలువు ఇలా గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు. సంక్రాంతి పండుగ అంటే ఇదే అన్నట్లుగా విద్యార్థులు చక్కగా కళ్లకు కట్టినట్లుగా నిర్వహించారు. విద్యార్ధులు సాంప్రదాయ దుస్తులు పంచె కండువ, విద్యార్ధినులు పట్టు లంగాలు కట్టి ఎద్దుల బండిపై ఎక్కి సందడి చేశారు. హరిదాసు చేసిన సందడికి సహ విద్యార్ధులు కేరింతలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. కళాశాల ప్రిన్సిపల్ ఏకాంబరం మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలనే నేటి తరం విద్యార్థులకు తెలియచెప్పడంతో పాటు, మన పండుగలు విశిష్టతను తెలియచేసేందుకు 'సంక్రాంతి సంబరాలు' కార్యక్రమాన్ని పూర్తిగా తమ విద్యార్థులు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బి.ఎస్.అప్పారావు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బి.శ్రీనివాస శ్రీకృష్ణ, వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయ బ్రిలియంట్స్ స్కూల్లో..
విజయవాడ : కృష్ణలంక బాపనయ్య నగర్‌లోని విజయ బ్రిలియంట్స్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్.వెంగళరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తొలిరోజు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించామని ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, టీచర్స్ పాల్గొని పలు అందమైన ముగ్గులు వేసి పలువురిని ఆకర్షించారన్నారు. వారిలో మూడు విభాగాలుగా చేసి వాటిలో ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశామన్నారు.
శ్రీభారతి హైస్కూల్లో..
విజయవాడ : కృష్ణలంక బీచ్ రోడ్డులోగల శ్రీభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ నందు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ శివకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌కెజి, యుకెజి విద్యార్థులు డ్యాన్సులు, ఆడ పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి సంక్రాంతి పండగ గురించి వివరిస్తూ ముగ్గుల విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఉత్తమ ప్రతిభ కనపరచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందించామన్నారు.
సంక్రాంతి సంబరాలు
