సిఎం కప్ అండర్ 17 కబడ్డీ పోటీలు
బాలుర విన్నర్స్‌గా వన్‌టౌన్ జైకిసాన్ స్కూల్
బాలికల్లో విన్నర్స్‌గా రామరాజ్యనగర్ జిఎన్ఆర్ స్కూల్
ప్రజాశక్తి - భవానీపురం
సిఎం కప్, కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ స్కూల్ గేమ్స్ అండర్-17 కబడ్డీ సెలక్షన్ పోటీలు శనివారం గట్టువెనుక ప్రాంతం విద్యాధరపురం లేబర్‌కాలనీ, రామరాజ్యనగర్‌లో గల గొల్లపల్లి నాగేశ్వరరావు (జి.ఎన్.ఆర్.) పాఠశాలలో ఘనంగా జరిగాయి. స్థానిక 29వ డివిజన్ కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందులో బాలుర, బాలికల విభాగం నుంచి రెండు జట్లను ఎంపికచేసి జిల్లాస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు శాఫ్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కబడ్డీకి సంబంధించి అండర్-17 సెలక్షన్ పోటీలు తన డివిజన్లోని పాఠశాలలో నిర్వహించటం ఎంతో ఆనందంగా వుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. జి.ఎన్.ఆర్. పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎస్తేరు రాణి మాట్లాడుతూ.. కబడ్డీ బాలికల విన్నర్స్‌గా తమ పాఠశాల విద్యార్థులు గెలుపొంది, జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావటం అభినందనీయమన్నారు. పాఠశాల పి.డి. సురేష్‌బాబు మాట్లాడుతూ.. తమ స్కూల్లో కబడ్డీ పోటీలు అధికారుల ఆదేశాల మేర కు నిర్వహించామన్నారు. బాలుర విభాగంలో వన్‌టౌన్‌కు చెందిన జైకిసాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విన్నర్స్‌గాను, విద్యాధరపురం కె.సి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్నర్స్‌గా నిలవగా, బాలికల్లో రామరాజ్యనగర్లోని జి.ఎన్.ఆర్.ఎం.సి,హెచ్. పాఠశాల విన్నర్స్‌గాను, వన్‌టౌన్‌కు చెందిన ఆర్.సి.ఎం. హైస్కూల్ రన్నర్స్‌గా నిలిచారని తెలిపారు.
