విజయవాడ దిగ్బంధనం

Jan 22,2024 08:05 #Blockade, #Vijayawada
  • అంగన్‌వాడీలపై రాష్ట్రవ్యాప్త నిర్బంధం
  • ‘జగనన్నకు చెబుదాం’కు రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు
  • పలు జిల్లాల్లోతొలగింపు ప్రకటనలు
  • సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద బాబురావు అరెస్ట్‌
  • నిరవధిక దీక్షా శిబిరం నుండి మరోనేత ఆస్పత్రికి తరలింపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తీవ్రమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వారిని విధుల నుండి తొలగిస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటనలు చేశారు. సోమవారం తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తామని, 25వ తేది కొత్త నియమాకాలకు నోటిఫికేషన్‌ ఇస్తామని పేర్కొన్నారు. మరోవైపు సోమవారం జరగనున్న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి రానీయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటున్నారు. విజయవాడను పోలీసులు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. కాకినాడ టూ టౌన్‌ పోలీసులు స్టేషన్‌లో గ్రిల్స్‌ ఉన్న గదిలో అంగన్‌వాడీలను నిర్బంధించారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యాలయంలోకి వెడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావును బలవంతంగా అరెస్ట్‌ చేశారు. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. బస్డాండ్లు, రైల్వేస్టేషన్‌లలో మఫ్టీలో నిఘా పెట్టారు. ఈ అడ్డంకులన్నీ అధిగమించి, విజయవాడకు చేరుకున్న వారిని గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా పెట్టారు. అంగన్‌వాడీలు బసచేసే అవకాశం ఉందని అనుమానించే అన్ని ప్రాంతాలను గాలిస్తున్నారు. ప్రభుత్వం ఇంతటి తీవ్రస్థాయిలో నిర్బంధ చర్యలు చేపట్టినా..అడ్డంకులను అన్నింటిని అధిగమించి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో విజయవాడ చేరుకున్నారు. ఆదివారం రాత్రి వందలాది మంది అంగన్‌వాడీలు విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద దీక్షా శిబిరం పరిసర ప్రాంతాల్లో నడిరోడ్డు మీదే నిద్రించారు. మరోవైపు అంగన్‌వాడీలను విధుల నుండి తొలగిస్తున్నట్లు పలు జిల్లాల కలెక్టర్లు ప్రకటనలు చేశారు. అన్ని జిల్లాల్లో రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లు, కలెక్టరేట్ల దగ్గర్లో అంగన్‌వాడీల టెంట్ల వద్ద పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడికక్కడ వందలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ టూటౌన్‌ పోలీసుస్టేషన్లో అంగన్‌వాడీలను సెల్లో వేశారు. అక్కడ వారు నినాదాలు చేస్తూ పోలీసుల తీరును ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలోకి వెళుతున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావును పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. మరోవైపు అంగన్‌వాడీల సమ్మెలో అసాంఘికశక్తులు చొరబడతాయని సమాచారం ఉందంటూ పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ధర్నాచౌక్‌లో అంగన్‌వాడీలు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు రాత్రి పదిగంటల సమయంలో సుమారు 100 మంది మహిళా కానిస్టేబుళ్లు చేరుకున్నారు. నిరవధిక దీక్ష చేస్తున్న ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు ఎలిజబెత్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడ అంగన్‌వాడీలను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తుండటంతో స్టేషన్లలోనే బైఠాయింపులకు దిగారు.. విజయవాడ నగరంలో ఎక్కడికక్కడ సిపిఎం నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. గృహ నిర్బంధాలకు దిగుతున్నారు. మచిలీపట్నం, గుడివాడలోనూ గృహ నిర్బంధం చేశారు.

సిపిఎం ఖండన

బాబూరావు అరెస్టును సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈడ్చుకుపోయి అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోనూ వేర్వేరు స్టేషన్లలో సెల్‌లో మహిళలను ఉంచారని, రాత్రి సమయాల్లో వారిని స్టేషన్లలో నిర్బంధించడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైలవరం స్టేషన్లో బాబూరావు దీక్ష

సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావును రాత్రి 11 గంటల సమయంలో మైలవరం స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుండి నేరుగా గవర్నరుపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ప్రైవేటు వాహనంలో ఎవరికీ తెలియకుండా నాలుగుగంటలు తిప్పిన అనంతరం మైలవరం స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకున్న సమయంలో తమ పార్టీ వారికి సమాచారం ఇవ్వాలన్నా ఇవ్వనీకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మైలవరం స్టేషన్‌కు తరలించిన అనంతరం గవర్నరుపేట పరిధిలో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా మంచినీళ్లు కూడా తాగనంటూ బాబూరావు నిరాహారదీక్షకు దిగారు. పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

➡️