పటిష్టంగా ఉప ప్రణాళిక అమలు
వివిధ శాఖలతో సమీక్షలో కలెక్టర్ హరిజవహర్ లాల్
ప్రజాశక్తి- కలెక్టరేట్
షెడ్యూల్డు కులాల ఉప ప్రణాళికను జిల్లాలో పటిష్టంగా అమలు పర్చాలని కలెక్టర్ యం.హరిజవహర్‌లాల్ అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించే నిధుల్లో 17 శాతం నిధులను ఎస్సిల అభ్యున్నతికి ప్రతిశాఖ తప్పని సరిగా వెచ్చించాలన్నారు. పథకాలు, కార్యక్రమాలు అమల్లో కూడా ఇదే విధానాన్ని పాటించాలన్నారు. ఈ లక్ష్య సాధనలో ఏమాత్రం అలక్ష్యం వహించినా సంబంధిత జిల్లా అధికారి వార్షిక రహస్య నివేదిక ఏ మాత్రం సక్రమంగా ఉండదని ఆయన హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన షెడ్యూల్డు కులాల ఉప ప్రణాళిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖ వెచ్చించే నిధులు, అమలు చేసే పథకాలు, కార్యక్రమాల్లో 17 శాతం మేర షెడ్యూల్డు కులాల అభ్యున్నతికి ఖర్చు చేయాలన్నారు. వ్యవసాయ, పశుసంవర్థక, డిఆర్డిఎ, మెప్మా తదితర శాఖలు మినహా మిగిలిన అన్ని శాఖలు ఉప ప్రణాళిక లక్ష్యాల సాధనలో చాలా వెనుకబడి ఉన్నాయంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖలు ఎస్సి ఉప ప్రణాళిక అమల్లో పూర్తిగా అలక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్య్తక్తం చేశారు. మైక్రో ఇరిగేషన్, మత్స్యశాఖలు కూడా నిర్ణీత లక్ష్యాల సాథనలో చాలా వెనుబడి ఉన్నాయన్నారు. ఉప ప్రణాళిక అమల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు రెండింతలు లక్ష్యాలతో ప్రభుత్వ శాఖలు అన్ని ముందుకు వెళితే, నిర్ణీత లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయని అధికారులకు సూచించారు. గృహ వినియోగార్థం ఎస్సిలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని ప్రభుత్వం ప్రకటిస్తే, విద్యుత్ శాఖ ఆ ప్రకటనను పరిగణలోకి తీసుకోకుండా చాలా గ్రామాల్లో ఎస్సిల నుండి విద్యుత్ బిల్లులు వస్తూలు చేయడం సరైనది కాదన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా కరకవలస, బొడ్డవలస తదితర గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎస్‌సిలే తమకు స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరపాలని, ఎస్సిల నుండి ఇప్పటి వరకూ వసూలు చేసిన విద్యుత్ బిల్లుల సొమ్మును తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాలని విద్యుత్‌శాఖ ఎస్ఇని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన శాఖలు అన్ని కూడా ఎస్సి ఉప ప్రణాళికను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాధ్ మాట్లాడుతూ కుప్పం నియోజక వర్గంలో పాలీక్లినిక్ ఉద్యాన పంటల సాగుతో రైతుల లక్షలు ఆర్జిస్తున్నారని, అటు వంటి విధానాలను ఉద్యానవన రైతుల అనుసరించేలా ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సునీల్‌రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సి ఉప ప్రణాళిక అమల్లో మైక్రో ఇరిగేషన్ శాఖ ప్రతిసారి జీరో ప్రగతిని చూపడం సరికాదన్నారు. ఎస్సి బ్యాక్ లాగ్ ఖాళీల వివరాలను అన్ని ప్రభుత్వ శాఖలు సోమవారం లోపు తమ కార్యాలయానికి అందజేయాలని జిల్లా అదికారులను ఆయన కోరారు. సమావేశంలో జెడ్పి సిఇఒ వెంకటేశ్వరరావు, డిఆర్డిఎ పీడీ సుబ్బారావు, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ నర్శింహులు, గృహ నిర్మాణశాఖ పీడీ రవికుమార్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి రవీంద్ర, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
పటిష్టంగా ఉప ప్రణాళిక అమలు
