-చేతులెత్తేసిన కార్మికశాఖ మంత్రి పితాని
ప్రజాశక్తి - బొబ్బిలి టౌన్
జిల్లాలో మూతపడిన జ్యూట్‌మిల్లులు తెరుచుకునే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన చర్చల్లో కార్మికశాఖామంత్రి పితాని సత్యనారాయణ దీనిపై చేతులెత్తేసినట్లు తెలిసింది. జిల్లాలో మూతపడిన బొబ్బిలి శ్రీలక్ష్మి శ్రీనివాస, విజయనగరంలోని అరుణా, ఈస్ట్‌కోస్ట్ జ్యూట్మిల్లుల సమస్యపై అమరావతిలో ఈనెల 7న కార్మికశాఖామంత్రి పితాని సత్యనారాయణ, రాష్ట్ర భూగర్భ గనుల శాఖామంత్రి ఆర్‌విఎస్‌కె రంగారావు ఆధ్వర్యాన కార్మిక సంఘాల నాయకులు, జ్యూట్మిల్లుల యాజమాన్యంతో చర్చలు జరిపారు. చర్చలు ప్రారంభానికి ముందే మూతపడిన జ్యూట్‌మిల్లులను తెరిపించడం సాధ్యం కాదని దీనిని దృష్టిలోపెట్టుకుని మాట్లాడాలని కార్మిక సంఘాల నాయకులకు కార్మిక శాఖామంత్రి పితాని సత్యనారాయణ చెప్పినట్లు తెలిసింది. జ్యూట్‌మిల్లులు తెరిపిస్తేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మిల్లులను తెరిపించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరినట్లు తెలిసింది. మొదటి విడతగా బకాయి పిఎఫ్, ఇఎస్ఐ బకాయి వేతనాలు కొంత మొత్తం చెల్లిస్తామని, మళ్లీ రెండు నెలల తరువాత చర్చలు ఏర్పాటు చేసి మిగతా సమస్యలను పరిష్కరించు కుందామని మంత్రులు చెప్పడంతో కార్మిక నాయకులు చేసేదేమీ లేక అంగీకరించినట్లు తెలిసింది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూతపడిన మిల్లులను తెరవచ్చు
మూతపడిన జ్యూట్‌మిల్లులను తెరిపించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే అరుణా, ఈస్టుకోస్ట్, శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌మిల్లులను తెరిపించే అవకాశం ఉంది. గోగునార సమస్య ఉండడం వలనే జ్యూట్ మిల్లులు మూతపడుతున్నాయని ప్రభుత్వ వాదన. రైతులు పండించే గోగునారకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాటు ఇతర దేశాల నుంచి గోగునార, గోనె సంచులను దిగుమతి చేసుకోవడంతో పాటు ప్లాస్టిక్ సంచులకు విచ్చలవిడిగా అనుమతులివ్వడం వల్లే జ్యూట్ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించి గోనెసంచులనే వినియోగించాలని ప్రభుత్వం చట్టం చేస్తే జ్యూట్ పరిశ్రమలకు మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న గోగునార, గోనెసంచులను పూర్తిగా షేదించి స్వదేశంలో పండిస్తున్న గోగునారకు గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ప్రొత్సహించాలి.
జ్యూట్‌మిల్లులను తెరిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటే ఈస్ట్‌కోస్ట్‌లో 3 వేల మందికి, అరుణాలో 3 వేల మందికి, బొబ్బిలి శ్రీలక్ష్మి శ్రీనివాసలో 2500 మంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
కేరళలో మూతపడిన జీడిపిక్కల పరిశ్రమను తెరిపించిన వామపక్షాలు
కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 35 జీడిపిక్కల పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో పనిచేస్తున్న 15 వేల మంది కార్మిక కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడ్డాయి. అక్కడ సిపిఎం ఆధ్వర్యాన వామపక్ష ప్రభుత్వం రావడంతో మూతపడిన జీడిపిక్కల పరిశ్రమలకు రాయితీలు ప్రకటించి తెరిపించారు. దీంతో రోడ్డున పడిన 15 వేల కార్మిక కుటుంబాలకు ఉపాధి దొరికింది. కేరళ ప్రభుత్వ మాదిరిగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మూతపడిన జ్యూట్ పరిశ్రమలను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో తెరుచుకోవడం లేదు.
వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ప్రభుత్వం చర్యలు
జిల్లాలో మూడు జ్యూట్‌మిల్లులు మూతపడడంతో ప్రభుత్వంపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో జ్యూట్‌మిల్లు తెరిపిస్తామని చెప్పిన టిడిపి నాయకులు నాలుగేళ్లు పూర్తయినా వాటిని తెరిపించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో జరిగిన చర్చల్లో ఇఎస్ఐ, గ్రాడ్యూటి, పిఎఫ్, బోనస్, బకాయి వేతనాలు విడతల వారీగా చెల్లించేందుకు యాజమాన్యాన్ని ప్రభుత్వం ఒప్పించిందే తప్పా మిల్లులను తెరిపించేందుకు ఒత్తిడి తేలేదు.
జ్యూట్‌మిల్లులు తెరుచుకోనట్లే..!
