ప్రపంచంలోని సూపర్ హ్యూమన్లను వెతికే పని అప్పజెబుతాడు డానియేల్ స్మిత్‌కు కామిక్ హీరోల సృష్టికర్త స్టాన్లీ. డానియేల్ కూడా ఓ సూపర్ హ్యూమనే. కాంటార్షనిస్ట్గా శరీరాన్ని ఎలా పడితే అలా మెలికలు తిప్పే అతడు చిన్న పెట్టెలో ఇరుక్కుపోగలడు. అలాంటి వాడు మన దేశంలోను ఉన్నాడు. రబ్బర్ బారు ఆఫ్ ఇండియాగా పేరుతెచ్చుకున్న ఆ బడి పిల్లాడు జస్ప్రీత్ సింగ్ కల్రా.
జస్ప్రీత్ గురించి చెబుతూ డానియేల్ ఊసెందుకంటే అతడి వల్లే కాంటార్షనిస్ట్ల విన్యాసాలు ప్రపంచానికి బాగా తెలిసాయి. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన జస్ప్రీత్కు ప్రేరణ కూడా అతడే. ప్రపంచంలోనే అతి అనువైన దేహం కలిగిన వ్యక్తిగా డానియేల్ పేరిట ఉన్న రికార్డును కైవసం చేసుకోవాలనేది జస్ప్రీత్ లక్ష్యం. దీని కోసం బాగానే మెలికలు తిరుగుతున్నాడు. కాళ్లను బాగా మడిచి భుజాల మీదకు ఎక్కించుకుంటాడు. తలను 180 డిగ్రీల కోణంలో తిప్పగలడు. సాధారణంగా మనిషి 90 డిగ్రీల కోణం వరకు మాత్రమే తలను తిప్పగలడు. పూర్తిగా వెనక్కి తిప్పి చూడగలడు. ఎవడి వీపు వాడు చూడలేడనే మాట జస్ప్రీత్ విషయంలో చెల్లదు. చేతుల్ని 360 డిగ్రీల కోణంలో తిప్పేయగలడు. వెనక్కు వంగి నీళ్లు తాగేయగలడు. పాదాలు, ముఖం వ్యతిరేఖ దిశలో ఉంచగలడు. ఇలా ఎన్నో విన్యాసాలతో గగుర్పాటుకు గురిచేసే జస్ప్రీత్కు ప్రస్తుతం 15 ఏళ్లు. తాను చదివే స్కూల్లో అతడో సూపర్‌స్టార్. ఉదయం వ్యాయామ సమయంలో పిల్లలంతా గుమికూడి జస్ప్రీత్ కసరత్తుల్ని ఫొటోలు తీసుకుంటారు. జస్ప్రీత్ ఆటోగ్రాఫ్‌లకు ఎగబడతారు. ఇక పండగకి, పబ్బానికి బంధువుల్ని తన ఒళ్లు తిప్పే కళతో ఆశ్చర్యపరుస్తారు. అతడి విన్యాసాలు చూసిన వారంతా జస్ప్రీత్కు ఎముకలు లేవేమో లేదా ఏదైనా ఇబ్బంది ఉందేమో అని వైద్యుల్ని సంప్రదించాలని సలహాలిస్తారట. కానీ అలా విన్యాసాలు చేస్తున్నపుడు జస్ప్రీత్కు అసలే ఇబ్బంది అనిపించదు. మనం మెటికలు విరిచినంత తేలిగ్గా శరీరాన్ని మెలితిప్పేస్తుంటాడు. ఏ రకమైన అనారోగ్య ఛాయలు కనిపించలేదు. చాలా ఆరోగ్యంగా ఉండే జస్ప్రీత్కు పది పదకొండేళ్లు వయసున్నపుడు అతడి తల్లి సురీందర్ కౌర్ కల్రా ఈ ప్రత్యేక దేహ తీరును గమనించింది. మొదట్లో భయపడినా ఆ తర్వాత వారికి జస్ప్రీత్ విన్యాసాలు అలవాటు అయిపోయాయి. 12 ఏళ్లపుడు యోగాలో చేర్పించడంతో అతడి ఫ్లెక్సిబిలిటీ మరింత ఎక్కువయ్యింది. కానీ మితిమీరిన విన్యాసాలు ప్రయత్నించడంతో ఓ సారి మోచేయి ఫ్రాక్చర్ అయ్యింది. అప్పుడు యూట్యూబ్‌లో ఇతర కాంటార్షనిస్ట్ల విన్యాసాలు చూసిన జస్ప్రీత్కు ఓ విషయం బాగా అర్థమయ్యింది. తన కన్నా మెరుగ్గా ఇతరులెవరూ తలను తిప్పలేరని తెలుసుకున్నాడు. ఏడాదిన్నర తర్వాత పూర్తిగా కోలుకున్న జస్ప్రీత్ తిరిగి విన్యాసాలతో ప్రదర్శనలివ్వడం ప్రారంభించాడు. వీటిని చూసే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతడి పేరు చేర్చారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించి అనేక విదేశీ మీడియా కవరేజీ కూడా పొందాడు. ప్రస్తుతం బడి పాఠాల్లో తలమునకలై ఉన్న జస్ప్రీత్ యోగానే కెరీర్‌గా ఎంచుకుంటాడనంటున్నాడు. కాంటార్షనిస్ట్గా రికార్డులు బద్దలు కొట్టి డానియేల్ తరహాలో పేరు సంపాదించాలని అనుకుంటున్న జస్ప్రీత్ ఇప్పటికే ఆ దరికి చేరిపోయాడు. తల్లిదండ్రులు కాంక్ష కూడా అదే కావడంతో మెలికలకు బ్రేక్‌లు లేకుండా పోయాయి.

.jpg)


