మతానికో వృక్షం అతి పవిత్రం. కళాకారు నికో చెట్టు అది అబ్బురం. దేశానికో మాను జాతి చిహ్నం. వీటన్నింటినీ గౌరవిస్తూ కేరళకు చెందిన మహమ్మద్ ఖోయా ఓ చోట చేర్చాడు. లౌకిక వనంగా మార్చి సమాజానికి అంకిత మిచ్చాడు.
కోజికోడ్ జిల్లాలోని ఆరంభ్రమ్కు చెందిన ఖోయాకు ఐదేళ్ల క్రితం స్థానికంగా ఉన్న రెండున్నర ఎకరాల వారసత్వ ఆస్తి వచ్చింది. కోట్లు పలుకుతున్న భూమి ధర. ఇంకేంటి చాలా డబ్బు అని కుటుంబీకులు సంబరపడ్డారు. కానీ, ఖోయా ఆ భూమిని ఏం చేయదలుచుకున్నాడనేది చెప్పేసరికి వారంతా కంగుతిన్నారు. పసిడి భూమిని పిచ్చి మొక్కలతో నింపేస్తానంటున్నాడు... పిచ్చేం పట్టలేదు కదా అనుకున్నారు. ఖోయాకు వృక్షాలంటే చాలా ఇష్టం. ప్రకృతిచ్చిన ఏదో ప్రత్యేక బంధం వృక్షాలనేది ఆయన అభిప్రాయం. చిన్నప్పటి నుంచి ఎంతో సాహిత్యాన్ని చదివాడు. వాటంతటా చెట్లతో సాన్నిహిత్యమే కనిపించింది. ఏ మత గ్రంథం తిరగేసినా ఏదో ఒక చోట వృక్ష ప్రస్తావనే. వాటికి అలౌకిక శక్తులను ఆపాదిస్తూ ప్రత్యేకంగా నిలబెట్టాయి. అదంతా అర్థం చేసుకున్నా లేకున్నా, జీవి మనుగడకు ప్రాణ వాయువును, భూమి చల్లగా ఉండేందుకు నీడను ఇస్తున్నాయి
అది చాలదూ, అంతకన్న దైవిక శక్తి ఇంకేం కావాలి అనేది ఆయన అభిప్రాయం. ఆ చెట్లను ఆయన అమితంగా ప్రేమించాడు. ఆ ప్రేమను వ్యక్తీకరించేందుకు రకరకాల మొక్కలను సేకరించి వనాన్ని రూపొందించాడు.
వంగ మామిడి నుంచి పైన్ వరకు..
గేబ్రియల్ గార్సియా మార్కిజ్ 'వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్'లో ఆకాశానికెత్తిన చెస్ట్నట్ వృక్షం ఆ లౌకిక వనంలో దర్పాన్ని ప్రదర్శిస్తుంది. దాన్ని లాటిన్ అమెరికా ట్రిప్కెళ్లినపుడు తెచ్చాడు. కేరళ ప్రసిద్ధ కథకుడు వైకోమ్ మహమ్మద్ బషీర్ మదిని దోచేసిన వంగ మామిడి చెట్టును నాటాడు. కవి కమలాదాస్కు ఇష్టమైన నీర్మతలమ్ చెట్టునూ సేకరించాడు. ఖలీల్ జిబ్రాన్ ఆరాధించిన సుబాబుల్ వృక్షానికి స్థలమిచ్చాడు. హిందూ పురాణాల్లో ప్రత్యేకంగా పేర్కొన్న కాదంబ వృక్షాన్ని, బైబిల్లో చోటిచ్చిన పైన్ చెట్టును పక్కపక్కన చేర్చాడు. స్వర్ణ వ్యాపారి అయిన ఖోయా తన వ్యాపారంపై విదేశాలు వెళ్లినప్పుడల్లా అక్కడి నుంచి ప్రత్యేకమైన జాతి చెట్లను తెస్తాడు. ఈయన సేకరణ గురించి విన్నవారు కూడా తమ వంతు చెట్లను బహూకరిస్తుంటారు. విదేశాల నుంచి పంపిస్తుంటారు. ఆయన ఏ పని మీద ఏ ఊరు, దేశం వెళ్లినా మొదటి ప్రాధాన్యత మొక్కల్ని సేకరించడమే. ముందే సమాచారాన్ని సిద్ధం చేసుకుంటాడు.
ఖోయా ముప్ఫై ఏళ్లపాటు దుబారులో పనిచేశాడు. తిరిగి స్వదేశానికి వచ్చి తన ఊరును చూసి విస్తుపోయాడు. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన తన ప్రాంతం ఇప్పుడు కాంక్రీట్ వనమైపోయింది. గజం స్థలం దొరికితే చాలు ఏదో ఒక నిర్మాణానికి ప్లాన్లు సిద్ధం చేసేవారు తయారయ్యారు. ఆయనకది బాధ కల్గించింది. తన వంతు ఏదైనా చేద్దామనుకోగా ఇంతలో సారవంతమైన భూమి వనానికి బీజం వేసింది. ఇంటిలో భార్య, పిల్లలే వ్యతిరేకించినా ఆయన వెనకడుగు వేయలేదు. వనాన్ని తీర్చిదిద్దేందుకు తీరిక చేసుకుని మరీ పనిచేశాడు. ఇప్పుడదొక నందనవనమైంది. ప్రపంచంలో ఎక్కడెెక్కడి నుంచో తెచ్చిన వృక్షరాజాలకు ఆలవాలమైంది. వీటిని కేవలం తన కోసమని కాక సమాజానికి అంకితమిచ్చాడు. ప్రతిరోజూ దూరప్రాంతాల నుంచీ బడి పిల్లలు ఎక్స్కర్షన్లకు ఇక్కడకు వస్తారు. వారికి ఉపయోగపడేలా ప్రతి చెట్టుకు ముందు వాటి వాడుక పేర్లు, శాస్త్రీయ నామాలు, అవి ఏ జాతికి చెందినవో, ఎక్కడ లభ్యమవుతాయో, ఏ సాహిత్యంలో పేర్కొన్నారో లేదా ఏ మతగ్రంథంలో దానికి విశేషముందో తెలిపే సమాచార బోర్డులను ఏర్పాటు చేశాడు. ఆ వనాన్ని సందర్శించడానికి ఎటువంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. ఆ అనుభూతులు పూర్తిగా ఉచితం. ఈ లౌకిక వనం విశేషాలు ఆ నోటా ఈ నోటా పాకి కేరళలో పర్యటిస్తున్న విదేశీయులు ఈ వనాన్ని ప్రత్యేకంగా సందర్శించి వెళుతున్నారు. పరిశోధకులకు కూడా వ్యయప్రయాసలను తగ్గి స్తోంది. దీన్ని సందర్శించిన వారంతా చెట్ల పెంపకం విలువను గ్రహించి తమ వంతు ప్రయత్నాలను ప్రారంభిస్తున్నారు. ఎన్ని నినాదాలిచ్చినా, ఎన్ని పాఠాలు బోధించినా తెలియని చెట్ల విలువ ఇక్కడ చేసిన ఓ సందర్శనతో విద్యార్థులకు అర్థమవుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పచ్చదనం వార్త తెలిసిన కుందేళ్లు, చిలకలు వంటి రకరకాల పశు పక్ష్యాదులు దీన్ని ఆవాసంగా చేసుకున్నాయి. అవి తమ కిలకిలా రావాలతో ఖోయాకు కృతజ్ఞతలు చెప్పేస్తున్నాయి. మరి మనమూ...!
