గాయానికి కుట్లు వేసేందుకు కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయి. చర్మాన్ని అతికించే జెల్ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే చీమలతో గాయానికి కుట్లు వేస్తారనే సంగతి తెలుసా. అవీ ఇవీ కావు గాట్టిగా కుట్టే కోపిష్టి సైనిక చీమలే దీనికి ఉపయోగపడతాయి. పూర్వకాలంలో వీటినే ఎక్కువగా వాడేవట కొన్ని ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా తెగలు. ఇప్పటికీ కొన్ని చోట్ల సంప్రదాయంగా దీన్ని కొనసాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏ సాధనం లేనపుడు వీటిని ఉపయోగిస్తున్నారు. కండను చీల్చేలా బలంగా కుట్టే చీమలతో చీలిక దగ్గర కుట్టిస్తారు. సైనిక చీమలు గట్టిగా కండను పట్టుకుని ఒక పట్టాన వదలవు. ఈ లోగా వాటి శరీరాన్ని వేరు చేసి కుట్టిన చీమ తలల్ని అలా వదిలేస్తారు. మూడు రోజుల తర్వాత గాయం మూతబడకపోతే మరోసారి కుట్టు వేస్తారు. దక్షిణ అమెరికాలో ఎటికాన్, తూర్పు ఆఫ్రికాలో డొరీలస్ రకం చీమ కాలనీల పహారా సైనిక చీమల్ని వాడతారు. మూడు వేల ఏళ్ల నాటి హిందూ చికిత్స గ్రంథాల్లో ఈ విషయం రాసి ఉందట. అలాగే ఏసియా మైనర్లో లభించిన ఓ ఆధారం ప్రకారం అంగుళం గాయానికి పది చీమల్ని వాడతారని తెలిసింది. అయితే ఈ పద్ధతిని అవలం బిస్తే....ఇన్ఫెక్షన్ సోకేఅవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.