* జెఎసి నేతలు హౌస్ అరెస్ట్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:
తెలంగాణ ఆర్టిసి జెఎసి నేతలు నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించారు. ముందుగా ప్రకటించిన కార్యక్రమం ప్రకారం సోమవారం నాడు దీక్షలు ప్రారంభం కావాల్సిఉంది. అయితే, పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తుండటంతో శనివారం నాడే అనేక చోట్ల నిరవధిక దీక్షలు ప్రారంభమయ్యాయి. మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఊర్మిలానగర్లోని నివాసంలోనే జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. కొత్తగూడెం, సంగారెడ్డి, ఆసిఫాబాద్ల్లో మహిళా సిబ్బంది దీక్షలకు దిగారు. ఆదివారం నాడు మరిన్నిచోట్ల ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. శనివారం నాడు బస్రోకో నేపథ్యంలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుండే కార్మికుల నివాసాలను చుట్టుముట్టారు. సమ్మెలో క్రియాశీలంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేశారు. మరోవైపు సమ్మె చేస్తామని కార్మికులు నోటీసులు ఇవ్వడమే చట్ట విరుద్ధమని టిఎస్ ఆర్టిసిహైకోర్టుకు తెలిపింది. ప్రజా సర్వీసుల్లో ఉన్న వారు సమ్మె చేస్తామనడం చట్ట విరుద్ధమని పేర్కొంది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఈ మేరకు శనివారం హైకోర్టుకు మరో అఫిడవిట్ దాఖలు చేశారు. యూనియన్ నేతలు దురుద్ధేశ పూర్వకంగా బ్లాక్ మెయిల్ చేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కార్మిక శాఖ మధ్యవర్తిత్వం చేపట్టినప్పటికీ... యూనియన్ నాయకులు ఓపిక పట్టలేదన్నారు. వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరుగుతున్న సమ్మె వల్ల ప్రజలు, కార్మికులు, యాజమాన్యం అందరూ నష్టపోతున్నారని తెలిపారు. ఈ అఫిడవిట్ సమర్పించడంపై జెఎసి నేత అశ్వత్థామ రెడ్డి స్పందించారు. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏంతెలుసని ప్రశ్నించారు. ఎండీగా బాధ్యతలు చేపట్టిన 17 నెలల్లో 7సార్లు కూడా ఆయన కార్యాలయానికి రాలేదని అన్నారు. సమ్మె వల్ల ఆర్టీసీ నష్ట పోలేదని, ప్రభుత్వ విధానాల వల్లే సంస్థ నష్టపోయిందని చెప్పారు. సునీల్ శర్మ అఫిడవిట్ ఫక్తు రాజకీయ అఫిడవిటేనని ఆయన ఆరోపించారు.
టి. ఆర్టిసి దీక్షలు ప్రారంభం
