* 18న సడక్ బంద్
* ఆర్టిసి జెఎసి, అఖిలపక్షం నిర్ణయం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:
సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం నిరవధిక నిరాహారదీక్షలు చేపడుతున్నట్టు ఆర్టిసి జెఎసి ప్రకటించింది. అదే విధంగా ఈనెల 18న సడక్ బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్
యూనియన్ కార్యాలయంలో విపక్ష నేతలతో జెఎసి నేతలు సమావేశ మయ్యారు. చలో ట్యాంక్‌బండ్ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ, హైకోర్టులో వాదనలు తదితర అంశాలపై చర్చించారు. చలో ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చిన కార్మి కులు, వివిధ పార్టీల నేతలపై పోలీసుల దమనకాండను ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులకు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధులకు జెఎసి ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం నుంచి నలుగురు జెఎసి నేతలు నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటున్నారని జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై జరిపిన నిరసనలో మావోయిస్టులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, సిపిఎం నేతలు తమ్మినేని వీరభద్రం, బి.వెంకట్, టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం, టిడిపి నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. సమ్మె 37వ రోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జెఎసి నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ మలక్‌పేటలో ఆర్టీసీ కార్మికుడు టివి టవర్ ఎక్కాడు. పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రేపటి నుండి దీక్షలు
