- అధికారులకు సిఎం దిశా నిర్దేశం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
దక్షిణాది రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ శెకావత్ అధ్యక్షతన హైదరాబాద్‌లో ఈ సమావేశం జరగనున్నది. నీటి పరిరక్షణ, తాగునీరు ప్రధాన ఎజెండాగా జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు, మిషన్ భగరీథ అధికారులు హాజరు కానున్నారు. జలశక్తి అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 256 జిల్లాల్లో ప్రారంభించిన కార్యక్రమంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. తాగునీరు, పారిశుధ్యం, భూగర్భ జలాల పరిరక్షణ, చెరువులు, సాంప్రదాయ జలవనరుల పరిరక్షణ, వాటర్‌షెడ్ కార్యక్రమాలు, అడవుల పెంపకం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి నవంబర్ నెలఖరు వరకూ సమావేశాలు నిర్వహించి దక్షిణాది రాష్ట్రాల్లో జలశక్తి అభియాన్ కార్యక్రమంపై కార్యాచరణ రూపొందించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ప్రతి ఇంటికి తాగునీరందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో ఈ సమావేశం జరుగుతున్నదని అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నీటిలో తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందిస్తారని వారు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరందించటానికి ఇప్పటికే చేపట్టిన మిషన్ భగీరథ గురించి ఈ సమావేశంలో వివరించాలని సీఎం అధికారులకు తెలిపారు. గోదావరి-కావేరి లింక్ పథకం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.
రేపు దక్షిణాది రాష్ట్రాల నీటిపారుదల మంత్రుల సమావేశం
