ప్రజాశక్తి - కల్చరల్
11ఏళ్ల శ్రియ హావభావాల్లో పరిణతను ప్రదర్శిస్తూ నర్తించిన అంశాలు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో శనివారం ప్రముఖ నాట్య గురువులు ప్రవీణ వాడపల్లి, మాధవి మారేళ్లపూడి శిష్యురాలు శ్రియ భరతనాట్య ఆరంగేట్రం జరిగింది. తొలి అంశంగా గణపతి కీర్తనను నాటరాగానుగుణంగా నర్తించి భరతనాట్య కళాకారిణుల ప్రతిభకు పరీక్షవంటిదైన జతిస్వరం వర్ణం, పదముద్రల మెలకువలు ప్రదర్శించారు. చివరి అంశంగా తిల్లానాలో శ్రియ వయసుకు మించిన హావభావాలను ప్రదర్శించారు. గురువు ప్రవీణ, చంద్రకాంత్ నటవాంగం చేయగా చందర్రావ్ గాత్ర సహకారం అందించారు. కౌండీన్యం మృదంగంపై, సాయికుమార్ వాయులీనంపై, ప్రమోద్ వేణువుపై సహకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాట్యగురువు గీతాగణేశం పాల్గొని శ్రియ భవిష్యత్లో గొప్ప కళాకారిణి కాగలదని అభినందించారు. తల్లి శిష్యరికంలో శ్రియ శిక్షణ పొందడం విశేషమన్నారు.
శ్రియ లాస్య నర్తనం
