- విజిలెన్స్ తనిఖీల్లో 380 క్వింటాళ్లు సీజ్
ప్రజాశక్తి - హైదరాబాద బ్యూరో
మేడ్చల్ సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయ పరిధిలో రూ.4.58 కోట్ల విలువ గల నకిలీ విత్తనాలు (380 క్వింటాళ్ల)ను సీజ్ చేసినట్టు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ముత్యంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని పలు గోడౌన్లలో తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను గుర్తించామన్నారు. ఏప్రిల్ నుంచి నేటి వరకూ చేసిన మొత్తం విజిలెన్స్ తనిఖీల్లో 380 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు.
వీటి విలువ సుమారు రూ.4.58 కోట్లు ఉంటుందన్నారు. వీటిని తయారు చేస్తున్న పలు కంపెనీలపై ఐపీసీ 420, 308 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 49 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి జైనూర్‌కు చెందిన సయ్యద్ జావిద్ నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను తీసుకొస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు గుడిహత్నూర్ క్రాస్ రోడ్డు వద్ద నిఘా పెట్టి పట్టుకున్నారు. 49 ప్యాకెట్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 98వేల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు సయ్యద్ జావిద్ పరారీలో ఉన్నాడు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో పలు గ్రామాల్లో ఆక్రమంగా తరలిస్తున్న 382 ప్యాకెట్ల బీటీ-3 పత్తి విత్తనాలను ములుగు ఏడీఏ ఆశోక్ కుమార్, సీఐ శివలింగం స్వాధీనం చేసుకున్నారు.
ఈ వాటి విలువ సుమారు రూ2లక్షల 55 వేలు ఉంటుందని చెప్పారు. ఆక్రమంగా విక్రయిస్తున్న బూడిది నరేష్గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు.
మేడ్యల్లో రూ.4.58కోట్ల నకిలీ విత్తనాలు!
