- తారిక్ అంజున్కు జీవిత ఖైదు
- జంట పేలుళ్ళ కేసులో నిందితులకు శిక్ష ఖరారు
- హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఇప్పటికే దోషులుగా తేల్చిన అనీక్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దోషులకు హైదరాబాద్‌లో ఆశ్రయం కల్పించారన్న అభియోగాలు రుజువు కావడంతో తారీక్ అంజుమ్‌కు జీవిత ఖైదు ప్రకటించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున జరిమానా విధించింది. లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌లో పేలుళ్ళు, దిల్‌సుఖ్‌నగర్‌లో పేలని బాంబు కేసుల్లో సయీద్,ఇస్మాయిల్‌పై నేరం రుజువు కావడంతో ఈ మూడు కేసుల్లో వారికి ఉరిశిక్ష పడింది. అయితే హైకోర్టులో అప్పీల్‌కు న్యాయమూర్తి అవకాశం కల్పించారు.
11 ఏళ్లపాటు కొనసాగిన ఈ కేసులో అనేక ఛార్జిషీట్లు, వాంగ్మూలాలు సేకరించిన న్యాయస్థానం దోషులకు ఎలాంటి శిక్షవేస్తుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. శిక్షలు ఖరారు నేపథ్యంలో చంచల్‌గూడ జైలు పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం నుంచి విచారణ కొనసాగించిన న్యాయస్థానం శిక్షకు సంబంధించి దోషులను విచారించింది. మీపై నేరం రుజువయ్యింది... కోర్టుకు చెప్పుకునేది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి అడగ్గా, ఈ కుట్రల్లో తమకెలాంటి భాగస్వామ్యం లేదంటూ దోషులు న్యాయమూర్తికి చెప్పారు. వారి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఎవరో చెప్పి ఒత్తిడి చేసిన మీదటే ఆ సంచులను వారు చెప్పినచోట పెట్టారని, అవి మారణహోమం సృష్టిస్తాయని తమ క్లయింట్లకు తెలియదని వాదనలు వినిపించారు. న్యాయమూర్తి స్పందిస్తూ' నేరం రుజువయ్యింది. ప్రాసిక్యూషన్ పక్కా ఆధారాలు సమర్పించింది. గత విచారణలోనే దోషులుగా తేల్చాం.ఇంకా చెప్పేదేమైనా ఉందా' అని అన్నారు. అనంతరం శిక్షల్ని వెల్లడించారు.
పదకొండేళ్ల తర్వాత తీర్పు
2007 ఆగస్టు25న జరిగిన జంటపేలుళ్లు ఘటన హైదరాబాద్‌ను కుదిపేసింది. లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌లలో ముష్కరులు నిముషాల వ్యవధిలోనే పేలుళ్లకు పాల్పడి 44 మంది అమాయకుల్ని బలిగొన్నారు. పేలుళ్లతో పాటు, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన ఘటనపై కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం మూడు కేసుల్ని నమోదుచేసింది. ఆ కేసులపై నాంపల్లిలోని రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సుదీర్ఘ విచారణ జరిపారు. ప్రధాన నిందితులుగా ఉన్న అనీక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను దోషులుగా తేల్చారు. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించటంలో విఫలమైన కారణంగా.. ఇవే కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న షఫ్రుద్దీన్, సాదిక్ ఇషార్లను నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. బాంబు పేలుళ్ల అనంతరం నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించారన్న అభియోగాలు ఎదుర్కొన్న నిందితుడు మహమ్మద్ తురీక్ అంజామ్ పాత్రపై విచారించిన న్యాస్థానం అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని తెలిసీ ఆశ్రయం కల్పించటంపై దర్యాప్తు సంస్థ ప్రత్యేక కేసు పెట్టింది. పేలుళ్ల కేసుల్లో నిందితులైన మరో ముగ్గురు అమీర్ రెజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లు పరారీలోనే ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి కేసును విడగొట్టి మిగిలిన వారిపై ప్రత్యేక కోర్టు విచారణ పూర్తి చేసింది.
అభియోగాలు ఇవీ
దేశంపై తిరుగుబాటు, బాంబులు పెట్టిన సంఘటనలకు కుట్ర పన్నినందుకు అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్, ఫరూక్, సాధిక్లపై ఐపీసీ సెక్షన్ 120బి, 307, 121ఎ, 153ఎలపై కేసు నమోదయ్యింది. వీరిపై పేలుడు పదార్థాల నిరోధక చట్టంలోని సెక్షన్ 4, 5 కింద, తీవ్రవాద చర్యల నిమిత్తం ఇండియన్ ముజాహుద్దీన్ (ఐ.ఎం.) పేరుతో పేలుళ్లకు పాల్పడటంతోపాటు, దేశ ప్రజల్లో భయం సష్టించడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం సెక్షన్ 13(1) (ఎ)(బి), 16(బి), 18, 20సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.