- టిఆర్ఎస్ శ్రేణులతో కెసిఆర్
- ముందస్తుపై కొనసాగుతున్న ఉత్కంఠ
- సమావేశం ముగియగానే ఢిల్లీకి పయనం
ప్రజాశక్తి - హైదరాబాద్ :
'ఎన్నికలు ఏ క్షణం వచ్చినా సిద్దంగా ఉండండి...' అని తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీపార్టీ, శాసనసభాపక్ష సంయుక్త సమావేశం జరిగింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం పరిశీలకుల్లో ఎంతో ఉత్కంఠను రేపింది. అయితే, ముందుగా ఊహించినట్లుగానే ఎన్నికలకు ముందుగా వెళ్లే విషయమై కెసిఆర్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే కెసిఆర్ ముందస్తు ఊహాగానాలను రేపుతున్నారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలోనూ ఆయన దాటవేత వైఖరినే అవలంబించారు. దీంతో ఏదో ఊహించి... సమావేశానికి వస్తే... తుస్సుమనిపించారని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు నిట్టూర్పు విడిచారు. ముందస్తు ఎన్నికలు, టిక్కెట్లు రాని ఎమ్మెల్యేల జాబితా... అంటూ రకరకాల ఊహాగానాలతో ఈ సమావేశానికి ఆ పార్టీ నేతలు వచ్చారు. ఈ అంశాలను కెసిఆర్ అసలు ప్రస్తావించలేదు. పార్టీ ప్రతినిధులు ఎవరినీ అభిప్రాయాలు కూడా అడగలేదు. సమావేశం ప్రారంభంలోనే ఆయన మైక్ తీసుకొని దాదాపు 45 నిముషాల సేపు మాట్లాడారు. అధికభాగం వచ్చేనెల 2వ తేదీ కొంగరకలాన్‌లో జరిగే భారీ బహిరంగ సభ, నియోజకవర్గాల వారీగా దానికి అవసరమైన జనసమీకరణ, వాహనాల ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికలపై మీడియా మాత్రమే ప్రచారం చేసుకుంటోందని, తానెక్కడా అధికారికంగా చెప్పలేదని...ఐనా...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలి'' అని ఆయన అన్నట్లు తెలిసింది. సిట్టింగ్ అభ్యర్ధుల్లో కొందరికి మాత్రమే టిక్కెట్లు వచ్చే అవకాశం లేదని, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా కేసీఆర్ చెప్పారని ఎమ్మెల్యేలు చెప్పారు. . సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడతారని తెలంగాణ భవన్ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం తన ప్రసంగం పూర్తికాగానే ఢిల్లీ వెళ్లాలంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశం అయిపోయాక బయటకు వచ్చిన ప్రజాప్రతినిధులు... ''సాబ్ క్యాతోభీ బోల్తా సిర్ఫ్ ముండీ హిలానా...జబాన్ నై హిలానా'' (పెద్దాయన ఏం చెప్పినా ఔనంటూ తల మాత్రమే ఊపాలి...నాలుక మాత్రం తిప్పొద్దు) అంటూ సరదాగా నవ్వుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను ముందస్తుపై వాకబు చేయగా '.అంతా ఆయన ఇష్టం. మీటింగ్‌లో మాత్రం దీనిపై ఏం చెప్పలేదు' అని సమాధానం చెప్పారు. సమావేశం అయిపోగానే అనేకమంది ఎమ్మెల్యేలు తమ జిల్లాలకు వెళ్లకుండా నగరంలోనే మకాం వేశారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు వేర్వేరు చోట్ల సమావేశాల్ని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ మీటింగ్ అయిపోగానే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ కలుసుకోవాలో చర్చించుకోవడం కనిపించింది. అయితే 2వ తేదీ బహిరంగ సభ గురించి మాట్లాడుకోవడానికే వెళ్తున్నామని ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు. అయితే, టిక్కెట్లు రాని అభ్యర్ధులు ఎవరు...తమకు పోటీగా ఉన్న అభ్యర్ధులు ఎవరు అనే విషయాలను చర్చించుకొనేందుకే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్టు సమాచారం.
ఏ క్షణమైనా సిద్ధంగా ఉండండి
