- వైసిపి నేత కాసు మహేష్‌రెడ్డి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో మైనింగ్ తవ్వకాలపై వాస్తవాలు తెలియాలంటే సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తప్పించేందుకు అమాయక కూలీలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సిఐడి విచారణతో కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, గతంలో వేసిన విచారణ తరహాలోనే అధికార పార్టీ నేతలను కాపాడేందుకు ఉపయోగపడుతుందన్నారు. గురజాల నియోజకవర్గంలో 70 లక్షల టన్నుల అక్రమ మైనింగ్ జరిగిందని, దాని విలువ రూ.480 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. మైనింగ్‌లో మంత్రులు, అధికారులకు సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే యరపతినేని అక్రమ మైనింగ్‌పై గతంలో పలుమార్లు వైఎస్ఆర్సిపి అనేక పర్యాయాలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టిందన్నారు. చివరకు వైసిపి నేత టిజివి కృష్ణారావు హైకోర్టును ఆశ్రయించడంతో డొంకంతా కదిలిందన్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో మైనింగ్‌ను ఆపాలని హైకోర్టు సూచిస్తే, మొత్తం నియోజకవర్గంలో మైనింగ్ పనుల్ని నిలిపివేయించి ఎమ్మెల్యే యరపతినేని కొత్త డ్రామాకు తెరతీశారన్నారు.
మైనింగ్‌పై సిబిఐ విచారణ జరపాలి
