- యుజిసి నిబంధనల అమలుకు కసరత్తు
- స్టడీ సెంటర్లు మూసేయాల్సిందేనా?
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంటోంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల దూరవిద్య సెంటర్ల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. యుజిసి 2013లో ఇచ్చిన టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ను అమలు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ద్వారా ఆయా వర్సిటీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన దూరవిద్యా కేంద్రాల ద్వారా పొందిన డిగ్రీలను ఇకమీదట అనుమతించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదనే వాదనను తెరమీదకు తెస్తోంది. కేవలం 2013 నాటి యుజిసి నిబంధనలను సాకుగా చూపిస్తూ, ఇక మీదట ఆయా వర్సిటీల డిగ్రీలు చెల్లుబాటు కావని చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ తదితర యూనివర్సిటీలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాకు చెందిన యూనివర్సిటీలు దూరవిద్య స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశాయి. వీటిలో ప్రధానంగా ఏపీకి చెందిన నాగార్జున, తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీల స్టడీ సెంటర్లు అగ్రభాగంలో ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న స్టడీ సెంటర్లలో సగం ఈ రెండు యూనివర్సిటీలవే కావడం గమనార్హం. ఇదే సమయంలో గీతం, ఇక్ఫై వంటి ప్రైవేటు యూనివర్సిటీలు కూడా దూరవిద్య స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశాయి. కళాశాలల్లో నేరుగా చదివే స్థోమత లేని విద్యార్థులు, గృహిణులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు దూరవిద్య కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్ధిరపడిన వారు ప్రమోషన్ల కోసం ఈ దూరవిద్య కేంద్రాల్లో సంబంధిత కోర్సులో అడ్మిషన్లు తీసుకుంటారు. ఇప్పుడు వీరందరికీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారబోతోంది. ''యుజిసి టెరిటోరియల్ జ్యురీడిక్షన్- 2013'' నిబంధనల ప్రకారం విశ్వ విద్యాలయం పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతున్న స్టడీ సెంటర్లన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైనవే. పైగా 2013 కంటే ముందే ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఆయా స్టడీ సెంటర్లన్నీ మూతపడే పరిస్థితి నెలకొంది.
తెలంగాణాలో 'దూర విద్య' లొల్లి
