రైల్వే ట్రాకుల దగ్గర చిరిగిన బట్టలతో దుమ్ము పట్టిన జుట్టుతో దీనంగా జీవచ్ఛవాల్లా కదిలే వీధి బాలల్ని గుర్తు తెచ్చుకోండి. వారిలో చాలా మంది ఒకప్పుడు తమ ఇళ్లలో గారాల పట్టీగానో, ముద్దుల బాబుగానో నిండు కళతో తిరిగినవాళ్లే. ఇంటి మీద అలిగో, చదువు భారంతోనో, దారి తప్పో, ఇంకెవరి మీదో కోపంతోనో రైలెక్కేసి మళ్లీ అమ్మ ఒడికి చేరలేనంత దూరమైపోతారు. నాన్న దగ్గరకు తీసుకోలేనంత దూరమైపోతారు. వాళ్లను తిరిగి ఇంటికి చేర్చి వేల కుటుంబాల గుండె కోతను, వ్యథను తీరుస్తున్నారు ఓ సాథీ (స్నేహితుడు). ఇంటిలాంటి చోటు మరొకటి ఉండదని అనే ఈ సాథీ ఇప్పటి వరకు 47 వేల మంది చిన్నారులను కాపాడారు.
గృహ హింస, లైంగిక వేధింపులు, పేదరికం వంటి కారణాలున్నా చాలా వరకు చిన్న చిన్న విషయాలే పెద్ద నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఇలా ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన 90 శాతం మంది తిరిగి ఇంటికి వెళ్లే ఆలోచన చేస్తారు. కానీ ధైర్యం చేయలేరు, వారిని చేర్చే మార్గాలు కనబడవు. వెంటనే అక్కున చేర్చుకుని ఇంటికి వెళ్లే పరిష్కారం చెబితే చాలా జీవితాలు, ఎన్నో కుటుంబాలు వేదన నుంచి బయటపడతాయి. 23 ఏళ్ల నిత్య సంఘర్షణ ద్వారా ప్రమోద్ కులకర్ణి చెప్పిన వాస్తవాలివి. వారిలో ఇంటి ఆలోచన కనుక పోతే శాశ్వతంగా చేజారే ప్రమాదం కూడా ఉందని ఆయన అంటారు. లైంగిక దాడి, మాదక ద్రవ్యాల అలవాటు, అంటు రోగాలు, నేర ప్రవృత్తి వంటి వాటి బారిన పడి భవిష్యత్తు అనేది కోల్పోతారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌ల వద్ద పెరిగేది పిల్లల వయసే కానీ వారి జీవితం కాదని చెప్పే ప్రమోద్ ఇప్పటి వరకు 47 వేల మంది పిల్లల్ని తిరిగి వాళ్ల ఇళ్లకు చేర్చారు. అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన ప్రమోద్ను చదువుకునే రోజుల్లో ఓ ఘటన మార్చేసింది. పూణె ఎస్ఎన్డీటీ బృందం నిర్వహించిన డ్రైవ్‌లో చాలామంది వీధి బాలల జీవితాల్లో మళ్లీ రావడం స్పష్టంగా గమనించిన ఆయన చదువయ్యాక తన పని అదేనని నిర్ణయించేసుకున్నాడు.
1992లో సొసైటీ ఫర్ అసిస్టెన్స్ చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ (సాతీ) ద్వారా తన కార్యక్రమాల్ని మొదలు పెట్టాడు. తనలాంటి ఆలోచన ఉన్నవారితో ఓ జట్టును రూపొందించుకుని తొలుత రారుచూర్ రైల్వేస్టేషన్లో ఉన్న వీధిబాలల్ని రక్షించాడు. వారిని ప్రభుత్వ బాలల గృహానికి తరలించి మెల్లిగా ఒక్కొక్కరి వివరాల్ని కౌన్సెలింగ్ ద్వారా కనుక్కున్నారు. పిల్లల్లో నమ్మకం సంపాదించేందుకు తల్లిదండ్రులు ఎలా సమాయత్త్తం అవ్వాలనే విషయమే కాక నెలరోజుల రీ ఓరియెంటేషన్ తరగతుల్ని నిర్వహించి బాలల భయాల్ని, సమస్యలకు పరిష్కారం చూపారు. ఇది విజయవంతమవడంతో మిగతా రైల్వేస్టేషన్లపై కూడా దృష్టి సారించారు. అలా కాన్పూర్, ముఘల్ సరారు, గోరఖ్‌పూర్, అల్లహాబాద్, అహ్మదాబాద్, పూణె, న్యూఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి, యశ్వంత్‌పురా, బెంగళూర్, హుబ్లీ, గుంతకల్, మంత్రాలయం వంటి నగరాల్లోని రైల్వేస్టేషన్లలో కార్యకలాపాల్ని విస్తరించారు. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు, అధికారులు, అమ్మకందార్లు, కూలీలు తదితరుల సహాయంతో వీధి బాలల్ని గుర్తించి హోమ్‌లకు తరలిస్తారు. ఆ తర్వాత పిల్లల పరిస్థితిని బట్టి చికిత్స చేయించడం, మత్తు అలవాట్లు పోగొట్టడం, చదువుపై శ్రద్ధ పెంచడం వంటి కార్యక్రమాలే కాక సృజనను పెంచి జీవితం మీద ఆసక్తి కలిగించేలా క్రీడలు, కళల్లో శిక్షణనిప్పిస్తారు. మధ్యాహ్న నిద్ర, ధ్యానం వంటి వాటి ద్వారా వారిలోని హైపర్ ఆక్టివిటీని తగ్గించేలా చేస్తారు. ప్రమోద్ కృషిని గుర్తించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. తిరిగి సొంతిళ్లకు చేర్చిన చిన్నారుల బాగోగులు తెలసుకోవడం కోసం కొన్నిరోజుల పాటు నిరంతర ఇన్సెపెక్షన్ చేస్తారు. అంతా బాగుందని నిర్థారించుకున్నాక ఏడాదికి నాలుగు సార్లు చొప్పున ఫోన్ కాల్స్ ద్వారా వారి బాగోగులు కనుక్కుంటుంటారు. చిన్నారితో నేరుగా మాట్లాడే వరకు వారు బాధ్యత వహించిన ముగ్గురు, నలుగురు దగ్గరి బంధువులు, పాఠశాలలు, కమ్యూనిటీలకు కూడా ఫోన్లు వెళతాయి. అవసరమైతే స్థానిక పోలీసుల ద్వారా వాకబు చేయిస్తారు. ఒకసారి ఇంటికి చేరిన తర్వాత పారిపోదామనే ఆలోచన మళ్లీ రాకుండా ఓ సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచడంలో తల్లిదండ్రులకు సాయం చేస్తారు.
పేదరికం, లైంగిక దాడి, గృహ హింస, అనాథల వంటి సందర్భాల్లో ప్రభుత్వ హోమ్ల్లోనో, మరో ఎన్జీవో ద్వారానో వారి భవిష్యత్తును మెరుగుదిద్దే ఏర్పాట్లు చేస్తారు. ఏటా 80 వేల మంది పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయి వచ్చి సుదూరంగా ఉన్న, తెలియని ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్నారు. కనిపించిన రైలు ఎక్కేసి వారిని తల్లిదండ్రులు కనుగొనే అవకాశాన్ని అసాధ్యం చేసుకుంటున్నారు. అంతమంది చిన్నారుల జీవితాల్లో కొంత మందివి మాత్రమే తమ ద్వారా రక్షించబడుతున్నాయని చాలామంది చేజారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రమోద్. తమ పునరంకిత కార్యక్రమాల్లో ఆ కుటుంబాలు అన్నాళ్లు పడిన వ్యథ ఎంత తీవ్రమైందో కళ్లారా చూస్తుంటే హృదయం చలించిపోతుందని చెప్పే ప్రమోద్, తమ ద్వారా ఓ చిన్నారి తమ కుటుంబాన్ని తిరిగి చేరుతున్నాడనే విషయం గొప్ప తృప్తి మిగులుస్తుందని చెబుతారు. క్షణికావేశంలో ఇళ్లు వదిలినవారికి తిరిగి ఇంటిని చేర్చే ధైర్యాన్ని, మార్గాన్ని అందించి నిజమైన సాతీ (మిత్రుడు) అనిపించుకుంటున్నారు ప్రమోద్. ఎంగిలి మెతుకుల కోసం వీధి కుక్కలతో పోటీ పడి చెత్తకుండీల చుట్టూ తిరిగే ఆ విషాద బతుకుల్ని చూసి జాలిపడి ఊరుకోవడం ప్రతి రైల్వేస్టేషన్లో కనిపించే నిత్యదృశ్యమే. రైలు పట్టాల దగ్గర జీవితం ట్రాక్ తప్పుతున్న వారి భవితను చూసి నిర్వేదం పలకడం మామూలే.కానీ ప్రమోద్లా స్పందిస్తే మార్పు సాధ్యమే.
కానీ, ప్రమోద్ నిట్టూర్పునే నిత్య ప్రేరణగా మార్చుకుని అరవై వసంతాలు పూర్తయినా మరో చిన్నారిని కాపాడేందుకు పరుగులు తీస్తూనే ఉన్నారు.
వీధిబాలల సాథీ
