మెత్తని మట్టితో చేసిన ఆలయ నిర్మాణాలు, సామాన్య మానవునికి దగ్గరగా ఆలయ నిర్మాణాలు, ఖజురహో, కోణార్కులకు తీసిపోని క్లిష్టమైన ఆకారాలు, కృష్ణుడి జీవిత విషయాలు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలు కళ్లకు కట్టినట్లు ఉండే శిల్పాలు, నాటి మానవుని జీవనశైలిని తెలిపే చిత్రాలతో బిస్నుపూర్ నగరం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
దక్షిణ బెంగాల్లోని బిస్నుపూర్లో మల్ల రాజులు తమ ఇష్టదైవమైన విష్ణువు కోసం అనేక దేవాలయాలు నిర్మించారు. పూర్వం అక్కడ రాళ్లు ఉండేవికావు. అందుకే బంక మట్టితో చేసిన ఇటుకలతో ఆ దేవాలయాలను నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న టెర్రకోట కళల కోసమే మల్లరాజులు తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తినంతా ధారపోశారు. కలకత్తాకు 200 కిలోమీటర్ల దూరంలో బిస్నుపూర్కు దిగువన ప్రాచీన రాజుల దుర్గం చూస్తే మనదేశంలో దేవాలయాల్లో ఎన్ని ఉత్సవవాలు జరుగుతాయో అర్థమౌతుంది. సౌభాగ్యమనేది ఒక్క వైభవం, ఐశ్యరంతోనే కాదు, ప్రకృతి పోషణ పట్ల ఉన్న ఆలోచన వల్ల కూడా వస్తుంది. నగరంలో ఉద్యానవనాలు, మంచినీటి ట్యాంకులు నిర్మించి ఒక మంచి ప్రణాళికను వేశారు. ఏపుగా పెరిగిన చెట్లతో గ్రామాలు ప్రశాంతంగా ఉండేవి.
ఆలయ నిర్మాణాన్ని 16 వశతాబ్దంలో ప్రారంభించారు. బిస్నుపూర్ ఆలయాల్లో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే బెంగాల్ పూరిగుడిసెల్లా వీటి పైకప్పు గుమ్మటంలా, చూర్లు వేళ్లాడుతుంటాయి. దేవుణ్ని తమ ఇంటికి దగ్గరగా తీసుకురావడానికి, సామాన్య మానవుణ్ని అర్థం చేసుకోవడానికి వీలుగా వారు ఆ విధంగా కట్టేవారు. రాతితో నిర్మాణాలు చేసేవారు, శిల్పులు తలుపులపైనా, స్తంభాలపైనా అతి క్లిష్టమైన ఆకారాలను చెక్కేవారు. ఇవి మధ్యప్రదేశ్లోని ఖజురహోకు, ఒరిస్సాలోని కోణార్క్కు ఏమాత్రమూ తీసిపోకుండా ఉన్నాయి. ఆ యుగాన్ని స్వర్ణయుగంగా చెప్పుకునేవారు.
అలువియల్ మట్టితోనే ఆలయాలు...
మల్ల రాజులు బ్రిటీషువారి, ముస్లిముల ఆగమనానికి ముందు 9 శతాబ్దాలు బిస్నుపూర్ను పాలించారు. వారు వచ్చిన తొలి రోజుల్లో మల్ల రాజులు మిలిటరీ సామర్థ్యానికి మారుపేరుగా ఉండేవారు. వీరు మిలిటరీ సామర్థ్యంలో మెసపటోమియన్లకు సమానులనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. వారి వివిధ దశలను చూస్తే రకరకాల కళల (భవననిర్మాణం, శిల్పకళ, సంగీతం) అభివృద్ధికి వారి ప్రోత్సాహం మనకు తెలుస్తుంది. వీర హింబిర్, రాజా రఘునాథ్ సింగ్, వీర సింగ్ వంటి వారి కాలంలో బిస్నుపూర్ బెంగాల్ నాగరికతకు ముఖ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. టెర్రకోట అందమైన నూతన ఆలోచనలకు ఒక ఉదాహరణ. దీనిని పూర్తిగా అలువియల్ మట్టితోనే కట్టారు. ఒక్క రాయిని కూడా ఉపయోగించలేదు. అయినా మంచి నైపుణ్యంతో కట్టుదిట్టమైన, అందమైన భవనాలను తమదైన శైలిలో నిర్మించారు. మెత్తటి మట్టితో చేసిన, బాగా కాల్చిన ఇటుకలతో ఆలయాలు, ఇతర కట్టడాలను నిర్మించారు. వాటిపైనే శిల్పాలను చెక్కారు. వీటిని గోడలమీద అతికించడానికి బంకలాంటి ప్రత్యేకమైకన పట్టీలను తయారుచేసేవారు. వాటిని నిపుణులైన కార్మికులు సున్నం, చింతగింజల జిగురు, ఇంకా జిగురుగా ఉండే ఇతర గింజలు, బాగా పండిన అరటి పండ్లు, బెల్లంతో తయారుచేసేవారు.
బిస్నుపూర్కు దిగువన కొన్ని కిలోమీటర్ల దూరంలో
కోట ప్రదేశంలో 26 ఎరుపు రంగు ఆలయాలు ఉంటాయి. వీటిని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిస్తోంది. వీటిలో కొన్ని చాలా పురాతనమైనవి. వీటి చుట్టూ గడ్డి, చెట్లు, పొదలు పెరిగి అవి వాటి లోపలి భాగాలకు కూడా వ్యాపించాయి.
రాస్ మంచ
అతిపురాతనమైన ఇటుకలతో కట్టిన ఆలయం రాస్ మంచ. దీనికి అందమైన కమాన్లతో 108 ద్వారాలు, స్తంభాల గది, విశాలంగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఈ ఆలయం మంటల్లో కుదులుతున్న రథంలా కనపడుతుంది. ఈ ఆలయంలో ఒక హాలు, గర్భగుడి ఉన్నాయి. ఇక్కడ ఒక పొడవైన, పోనుపోను సన్నగా ఉండే పిరమిడ్ స్తంభం ఉంది. ఈ స్తంభం పైకప్పుకు తాకే చోట నాలుగువైపులా గుడిసె ఆకారంలో చిన్న గోపురాలు ఉంటాయి. ఇవి బెంగాల్ గ్రామ సంస్కృతిని ప్రతిబింబింపజేస్తాయి. ఈ ఆలయాన్ని 1587లో వీర హింబిర్ నిర్మించారు. హోలీ పండుగ రోజు ఆతిథ్యమివ్వడానికి ఈ ఆలయాన్ని కట్టించారు. మల్ల వంశంలో హింబిర్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకునేవారు. రాస్ మంచలో గోడలు, తలుపులు, స్తంభాల మీద అందంగా చెక్కిన శిల్పాలు దైవచింతనను ప్రేరేపించేవిగా ఉంటాయి. ఈ శిల్పాలన్నీ కూడా భాగవత పురాణానికి సంబంధించినవి. కృష్ణుడు రకరకాల భంగిమలలో కనిపిస్తాడు. వెన్న దొంగగా, పశువుల కాపరిగా, ఫ్లూటు వాయిస్తున్నట్టుగా, నీటి ఆటలను చూస్తున్నట్టుగా, గోపికలతో ఆడుతున్నట్టుగా.. ఇవి శిల్పులకు, భవనాలను నిర్మించేవారికి, నిపుణులైన కార్మికులకు స్ఫూర్తిగా, శాశ్వత వనరుగా ఉన్నాయి.
బిస్నుపూర్కు సంవత్సరమంతా వెళ్లొచ్చు. అయితే ఆగస్టులో ఝపాన్ పండుగ సమయంలోగానీ, డిసెంబరు చివరి వారంలో బిస్నుపూర్ మేళా సమయంలోగానీ చాలా బాగుంటుంది.